రాహుల్‌ ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు: షా

22 Sep, 2019 14:13 IST|Sakshi

ముం‍బై ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా

సాక్షి, ముంబై: దేశాన్ని పాలించిన గత ప్రభుత్వాలు కశ్మీర్‌ను కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. తమ ప్రభుత్వ ఏర్పడిన వందరోజలు లోపలే కశ్మీరీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని అన్నారు. ముంబైలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్‌, విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ కశ్మీర్‌ అంశాన్ని ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారని, దేశాన్ని పాలించిన వారి కుటుంబికులే కశ్మీర్‌కు ఈ గతిపట్టించారని మండిపడ్డారు.

రాహుల్‌ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, కానీ తమ పార్టీ మూడు దశాబ్దాల నుంచి కశ్మీర్‌ విముక్తి కోసం పోరాటం చేస్తోందని షా గుర్తుచేశారు. కశ్మీరీల కోసం తమ పార్టీ నేతల కలల్ని ప్రధాని మోదీ సాకారం చేశారని షా అభివర్ణించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పౌరుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికల రాబోతున్నాయని షా ప్రకటించారు.

మరిన్ని వార్తలు