-

మోదీకి మిక్కిలి సన్నిహితుడు

31 May, 2019 04:15 IST|Sakshi

బీజేపీలో వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఉత్తేజం చేసి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేలా చేయడంలో సఫలమైన అనంతరం, ఇక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా (54) సిద్ధమయ్యారు. గురువారం ఆయన కూడా మోదీ మంత్రివర్గంలో చేరారు. మోదీకి షా అత్యంత సన్నిహితుడు. ఏ చిన్న సలహా కోసమైనా మోదీ అమిత్‌ షాను ఆశ్రయిస్తారని పార్టీ నాయకులు నమ్ముతారు. 2014లో అమిత్‌ షా బీజేపీ జాతీయాధ్యక్షుడయ్యారు.

అంతకుముందు జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 80కి 71 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంలో అమిత్‌ షా కీలకంగా వ్యవహరించారు. మోదీ తర్వాత బీజేపీలో రెండో శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీ నగర్‌ స్థానం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 2014 మధ్య 13 ఏళ్లపాటు గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, అమిత్‌ షా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో చిక్కుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఆయన ఆ కేసు నుంచి బయటపడ్డారు.

గుజరాత్‌లో పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా షా కీలకంగా వ్యవహరించారు. కరుడుగట్టిన హిందూత్వ, జాతీయవాది అయిన అమిత్‌ షా కేంద్ర ప్రభుత్వంలోకి రావడాన్ని బీజేపీ కార్యకర్తలు హర్షిస్తున్నారు. ప్రభుత్వంలోకి వచ్చినా సరే పార్టీ ఎజెండాను నిర్ణయించడంలో అమిత్‌ షా కీలకపాత్ర పోషిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కన్నా తాజా ఎన్నికల్లో బీజేపీకి 21 సీట్లు ఎక్కువే సంపాదించిపెట్టిన అమిత్‌ షా, ఆ పార్టీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడని అంటారు. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అమిత్‌ షా బీజేపీతో ఉంటూ 40 ఉన్నత శిఖరాలను అధిరోహించారు.  

మరిన్ని వార్తలు