నువ్వా ఆత్మగౌరవాన్ని కాపాడేది?

16 Sep, 2018 03:18 IST|Sakshi
‘మార్పు కోసం బీజేపీ శంఖారావం’లో ఢంకా మోగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.

ఒవైసీకి భయపడే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు

మహబూబ్‌నగర్‌ సభలో కేసీఆర్‌పై అమిత్‌ షా మండిపాటు

ఎంఐఎంతో మీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు సహించరు

మే నెలలో గెలవని మీరు ముందస్తులో ఎలా గెలుస్తారు?

దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు... టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఈసారైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?

మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అధినేత

మహబూబ్‌నగర్‌ నుంచి సాక్షి ప్రతినిధి: ఒవైసీకి భయపడే కేసీఆర్‌.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతారని బీజేపీ అధినేత అమిత్‌షా ప్రశ్నించారు. ఎంఐఎంతో కలసి టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ‘మార్పు కోసం.. బీజేపీ శంఖారావం’పేరిట శనివారం ఏర్పాటు చేసిన సభ నుంచి బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ రజాకార్ల పాలన వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తుచేశారు. విమోచన దినాన్ని నిర్వహించలేని టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా గౌరవిస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగానిర్వహిస్తామన్నారు.

2014లో గెలిస్తే దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఆ తర్వాత మోసం చేశారన్నారు. 2018లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తారా.. లేక మీ కుమారుడిని సీఎం చేస్తారా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అవివేకమన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో కేసీఆర్‌ చెప్పాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. మే నెలలో ఎన్నికలు వస్తే ఓడిపోతామని టీఆర్‌ఎస్‌ భయపడిందా? లేదా లోక్‌సభతో కలసి వస్తే గెలవలేమని ఆందోళన చెందారా? అని ప్రశ్నించారు. అప్పుడు గెలవని వారు నవంబర్, డిసెంబర్‌లో ఎలా గెలుస్తారన్నారు. టీఆర్‌ఎస్‌ బలవంతంగా ప్రజలపై ముందస్తు ఎన్నికలు రుద్దుతోందని విమర్శించారు. ముందస్తు ద్వారానే టీఆర్‌ఎస్‌పై తాము ఎన్నికల రణభేరి మోగిస్తున్నామని షా వెల్లడించారు.

పగలు కలలు కంటున్న రాహుల్‌..
రాత్రి వేళల్లోనే కాదు.. పగటి పూట కూడా రాహుల్‌బాబా కలలు కంటున్నారని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, హరియాణాతోపాటే తెలంగాణనూ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని చమత్కరించారు. మోదీ నేతృత్వంలో మహారాష్ట్ర నుంచి మొదలుకుని త్రిపుర వరకు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. పీవీ నరసింహారావు, అంజయ్యకు కాంగ్రెస్‌ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ టీఆర్‌ఎస్‌ అబద్ధమాడుతోందని దుయ్యబట్టారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు ఓబీసీ వర్గాల రిజర్వేషన్లు కట్‌ చేసి మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశంలోని అక్రమంగా చొరబడిన వారిని తిరిగి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ తీసుకొచ్చిందన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారు హైదరాబాద్‌లోనూ ఉన్నారని పేర్కొన్నారు. చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వెతికి వెనక్కి పంపిస్తామని, వారి కారణంగా దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని అమిత్‌షా స్పష్టం చేశారు. .

అన్నింటా మోసమే..
రాష్ట్రంలో దళితులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని అమిత్‌షా దుయ్యబట్టారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రతీ జిల్లాలో 100 పడకల ఆస్పత్రి, మండల స్థాయిలో 30 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ అంశాన్ని మరిచిపోయిందని ఆరోపించారు. రాష్ట్రానికి మోదీ సర్కార్‌ వివిధ పథకాల కింద రూ.1.15 లక్షల కోట్లు మంజూరు చేసిందన్నారు. ముద్రా రుణాలు, స్మార్ట్‌ సిటీ, అమృత్‌ సిటీ, హైవేల అభివృద్ధి, ఇతర పథకాల కింద ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే, 5 లక్షల కుటుంబాలకు గ్యాస్‌ క్యానెక్షన్లు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో 30 కిలోమీటర్ల మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు.

బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని, అన్ని వర్గాలకు సమన్యాయం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుందని.. ఇందులో భాగంగా మద్దతు ధర కల్పించిందన్నారు. దేశంలోని ప్రజల కోసం మోదీ ప్రభుత్వం రూ.5 లక్షల విలువైన ఆరోగ్య పథకం ఆయుస్మాన్‌భవ అమల్లోకి తెచ్చిందన్నారు. దీనిని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రజలు బీజేపీకి ఎక్కడ దగ్గరవుతారో అన్న భయంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ పథకం అమలు చేయడానికి వెనుకంజ వేసిందన్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదులు దేశంలోని చొరబడి వి«ధ్వంసం సృష్టించేవారని, కానీ మోదీ వచ్చిన తరువాత మన సైనికులు సర్జికల్‌ స్ట్రైక్‌తో పాకిస్తాన్‌ను దెబ్బతీశారన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని అమిత్‌షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం...
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విషయంలో రాష్ట్ర ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. సీపీఎస్‌లో చేరతారా? పాత పెన్షన్‌ స్కీంను కొనసాగిస్తారా? అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అడిగితే సీపీఎస్‌లో చేరాతామని వెళ్లి ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సీపీఎస్‌లో చేరి, ఇప్పుడు నిందను కేంద్రంపైకి నెడుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ స్కీంను అమలు చేస్తామన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడమే కాకుండా రైతు రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళా సంఘాల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. పావలా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల చొప్పున రుణాలిస్తామన్నారు. ఈబీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  

ప్రభుత్వాన్ని నడపలేక సతమతం..
ప్రభుత్వాన్ని నడపలేని నాయకత్వంతో టీఆర్‌ఎస్‌ సతమతం అవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. అందుకే ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చినా మధ్యలోనే కాడి కింద పడేసిందని ఎద్దేవా చేశారు. మరోసారి ఓట్లు వేస్తే వయోభారం అంటూ రెండున్నరేళ్లకే ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చే ఎన్నికల్లో రూ.500, రూ.2000 నోట్ల బలంతో ముందుకు వెళ్లాలని చూస్తోందని, అలాంటి ప్రలోభాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉన్న సచివాలయంలో అడుగు పెట్టని కేసీఆర్‌ కొత్త సచివాలయం కడతారట అని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కడతానని చెప్పి దళితులను అన్ని విధాలా మోసం చేశారన్నారు. బంగారు తెలంగాణ పేరు చెబుతూ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 సీట్లలో కురుమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకుండా అవమానపరిచారన్నారు. తెలంగాణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఇంకా ఉందా అని మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల దరిద్రానికి, అవినీతి అక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. అనైతిక పొత్తు పెట్టుకుంటున్న ఈ రెండు పార్టీలను తెలంగాణ సమాజం తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కళాకారులతో కలసి డప్పు కొడుతున్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి

మరిన్ని వార్తలు