ఓవైసీని ఎదుర్కొనే దమ్ము మాకే ఉంది : అమిత్‌ షా

25 Nov, 2018 13:36 IST|Sakshi

ముస్లింలకు రిజర్వేషన్లు సబబేనా

నిర్మల్‌ ప్రచార సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా

సాక్షి​, నిర్మల్‌ : ఎంఐఎంను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఏవిధంగా సబబని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీని ఎందుకు అమలుచేయలేదని.. లక్షా 7వేల ఉద్యోగాల ఇస్తామన్న మాటను కేసీఆర్‌ ఎందుకు నిలబెట్టుకోలేదని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కొండగట్టు బాధితులను పరామర్శించడానికి కేసీఆర్‌కు సమయంలేదని.. ఓవైసీతో కలిసి బిర్యానీ తినడానికి సమయం దొరికిందా అని మండిపడ్డారు.

కూతురు కోసమే ముందస్తు...
కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే గెలవలేమని భావించే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తన కొడుకు, కూతురిని గెలిపించుకోవడానికే అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించారు.

ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ... కేసీఆర్‌ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, బీసీ కమిషన్‌కు మోదీ చట్టబద్ధత కల్పించారని ఆయన కొనియాడారు.  మోదీ హయంలో దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ 2లక్షల 30వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అమిత్‌షా కోరారు.  

మరిన్ని వార్తలు