ఒకే దేశం.. ఒకే భాష

15 Sep, 2019 03:35 IST|Sakshi

భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలన్న హోంమంత్రి అమిత్‌ షా

హోంమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు, కర్ణాటక పార్టీల మండిపాటు

హిందీ జాతీయ భాషన్నది అబద్ధపు ప్రచారమేనన్న కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య

న్యూఢిల్లీ/చెన్నై/కోల్‌కతా/బెంగళూరు: కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ‘హిందీ’ తేనెతుట్టెను కదిపారు. భారతదేశం మొత్తానికి ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరముందన్నారు. ఈ లోటును హిందీ తీర్చగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్నారు. ఢిల్లీలో శనివారం ‘హిందీ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి.

హిందీని బలవంతంగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తే దేశ సమగ్రతకే ప్రమాదమనీ, ఇండియా ముక్కలైపోతుందని హెచ్చరించాయి. అమిత్‌ షా వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని తమిళ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. అధికార భాషల చట్టం–1963 ప్రకారం భారత పార్లమెంటు, ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ, ఇంగ్లిష్‌లను అధికార భాషలుగా గుర్తించారు. 1953 నుంచి ఏటా సెప్టెంబర్‌ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  దేశంలో 44 శాతం మంది మాతృభాష హిందీయే.

గాంధీ, పటేల్‌ల స్వప్నం అదే..
ప్రజలంతా తమ ప్రాంతీయ భాషలను వీలైనంత ఎక్కువగా వాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ‘భారత్‌ అనేక భాషలకు నెలవు. ప్రతీభాషకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేశం మొత్తంమీద ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరం చాలాఉంది. ఇది అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం దేశాన్ని ఏకం చేయగల సత్తా ఏ భాషకైనా ఉందంటే అది హిందీ మాత్రమే. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడుతారు. హిందీ భాష దేశాన్ని ఏకం చేయగలదు. దీనివల్ల విదేశీ భాషలు(ఇంగ్లిష్‌), సంస్కృతులు మనపై పెత్తనం చేయలేవు.

కాబట్టి ప్రతిఒక్కరూ తమ ప్రాంతీయ భాషలను విరివిగా వాడండి. అదే సమయంలో హిందీని జాతీయభాషగా చేయాలన్న మహాత్మాగాంధీ, సర్దార్‌ పటేల్‌ల స్వప్నాన్ని సాకారం చేయండి’ అని అమిత్‌ షా చెప్పారు. గాంధీ, పటేల్‌లు కూడా హిందీని జాతీయభాషగా చేయాలని దేశప్రజల్ని కోరారని షా గుర్తుచేశారు. భారత్‌లో 122 భాషలు, 19,500కుపైగా మాండలికాలు ఉన్నాయని షా గుర్తుచేశారు. కాగా, హిందీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తాను హిందీని మాతృభాష స్థాయిలో ప్రేమిస్తానని  హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

తమిళనాడులో..
ఒకవేళ కేంద్రం మాపై హిందీని ఏకపక్షంగా రుద్దితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తమిళనాడు సాంస్కృతిక శాఖ మంత్రి, అన్నాడీఎంకే నేత కె.పాండియరాజన్‌ హెచ్చరించారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భగం కలిగిస్తాయని డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలను సీపీఐ, పీఎంకే, ఏఎంఎంకేతో పాటు పలు ద్రవిడ పార్టీలు వ్యతిరేకించాయి.

పశ్చిమ బెంగాల్‌లో..
ప్రజలు అన్ని సంస్కృతులను గౌరవించాల్సిందేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే అందుకోసం మాతృభాషను పణంగా పెట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు, హిందీ, హిందూ, హిందూత్వ కంటే భారత్‌ చాలా పెద్దదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. భారతీయులందరి మాతృభాష హిందీ కాదని స్పష్టం చేశారు.

కర్ణాటకలో..
‘మేం హిందీని వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దడాన్నే తప్పుపడుతున్నాం’ అని కర్ణాటక కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ట్వీట్‌చేశారు. జేడీఎస్‌ నేత కుమారస్వామి మాట్లాడుతూ..‘కేంద్రం హిందీ దినోత్సవాన్ని జరుపుతోంది. మిస్టర్‌ మోదీ.. మీరు కన్నడ దినోత్సవం ఎప్పుడు జరపబోతున్నారు? హిందీలాగే కన్నడ కూడా అధికార భాషే’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యమిస్తామని కన్నడ సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

మరిన్ని వార్తలు