అమిత్‌ షా సారథ్యంలో ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారం

30 Aug, 2019 12:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సెప్టెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా సాగే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం సినీ, క్రీడలు సహా పలు రంగాల ప్రముఖులకు సైతం తన ఆలోచనలను నివేదించనుంది. ఆర్టికల్‌ 370పై బీజేపీ సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ జన జాగరణ్‌ అభియాన్‌, సంపర్క్‌ అబియాన్‌లను నిర్వహించనుంది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో ఈ నిర్ణయాలు రాజకీయంగా పార్టీకి లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తోంది. రాజకీయ లబ్ధితో పాటు విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా జిల్లా, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో సభల ద్వారా ప్రచార భేరి మోగించాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రస్ధాయిలో జరిగే సమావేశాల్లో ఓ సమావేశానికి కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్‌ షా హాజరవుతారు. ఇక 2000 మంది సెలబ్రిటీలను కమలనాధులు కలిసి కశ్మీర్‌  పరిణామాలపై కేంద్రం వ్యవహరించిన తీరును వివరించున్నారు. ప్రస్తుతం ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల జాబితాను రూపొందించే పనిలో బీజేపీ వర్గాలు నిమగ్నమయ్యాయి.

మరిన్ని వార్తలు