ఫలించిన మోదీ, షా వ్యూహం!

23 Nov, 2019 14:15 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్‌ పవార్‌ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్‌ శదర్‌ పవార్‌కు తెలియకుండా పార్టీని నిలువునా చీల్చి సగం మంది ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రేను ప్రకటించడం, హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ సేనకు మద్దతు ప్రకటించడం అజిత్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలింస్తున్న బీజేపీ.. శివసేనకు చెక్‌ పెట్టేందుకు ఎన్సీపీ నేతలు తమ వైపుకు తిప్పుకోవాలని ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతో శరద్‌ పవార్‌ భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా శరద్‌ పవార్‌ను చూసి సభ్యులు చాలా నేర్చుకోవాలి అని మోదీ ప్రశంసలు కురిపించడం కూడా దీనిలో భాగంగానే పలువురు వర్ణించారు. (ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు)

మహారాష్ట్రలో బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటిస్తే శరద్‌ పవార్‌కు రాష్ట్రపతి పదవిని కూడా కేంద్రం ఆఫర్‌ చేసిందనే పుకారు షికారు చేసింది. కానీ వీటన్నింటినీ పవార్‌ కొట్టిపారేశారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చరాలేదని, కేవలం రైతుల ఆత్మహత్యలపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. అయితే వారిద్దరి మధ్య భేటీ సమయంలో మోదీ, పవార్‌ తప్ప మూడో వ్యక్తి లేకపోవడంతో ఊహాగానాలు మరింత వ్యక్తమయ్యాయి. ఓవైపు శివసేన, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే బీజేపీకి దగ్గరయ్యేందుకు పవార్‌ ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా సాగింది. అయితే వాటిన్నింటికీ సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవార్‌.. ఉద్ధవ్‌ ఠాక్రేనే సీఎం అభ్యర్థిని స్పష్టం చేశారు. దీనికి మూడు పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, త్వరలోనే ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. శనివారం ఉదయం దాదాపు దేశంలోని అన్ని పత్రికలూ ఇదే వార్తను పతాక శీర్షికలుగా ముద్రించాయి. కానీ తెల్లారే సరికి రాజకీయాలు అనుహ్యంగా మారిపోయాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్‌ బీజేపీకి మద్దతు తెలిపారు. (ఉత్కంఠగా బలపరీక్ష!)

అయితే మోదీ, అమిత్‌ షా చతురత ఫలితంగానే అజిత్‌ను తమ వైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక, గోవా అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న షా, మోదీ ద్వయం ఇక్కడ కూడా అలాంటి వ్యూహాలనే అమలు చేసింది. సీఎం పీఠంపై బీజేపీతో వైరాన్ని సృష్టించిన శివసేనకు గట్టి బదులివ్వాలనుకున్న షా.. ఆ ప్రయోగాన్ని అజిత్‌పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు వ్యతిరేకంగా అజిత్‌ గళం విప్పడంతో పాటు అయనపై ఉన్న ఈడీ కేసులను చూపి షా గాలం వేసినట్లు సమాచారం. కాగా తాజా పరిణామాలు ఎన్సీపీ, శివసేనకు ఎదురుదెబ్బగా ముంబై వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శతాబ్దాల వైరాన్నీ పక్కన పెట్టిన శివసేన కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలవడం సేన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో హిందూ ఓటర్లు సేనకు కొంతదూరమయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం)

మరిన్ని వార్తలు