కాంగ్రెస్‌–బీఎస్పీ పొత్తుతో నష్టమే!

11 Sep, 2018 03:02 IST|Sakshi

దళితులు సహా ఓబీసీలు, అగ్రవర్ణాలపై దృష్టి పెట్టండి

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ నేతలకు షా నిర్దేశం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ–కాంగ్రెస్‌ పొత్తులపై బీజేపీ చర్చించింది. ఈ పొత్తు కుదిరితే అది పార్టీకి కొంతమేర నష్టం చేస్తుందని పార్టీ చీఫ్‌ అమిత్‌ షా.. ఈ మూడు రాష్ట్రాల అధ్యక్షులకు సూచించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, మిగిలిన ప్రచారాస్త్రాలపై వీరికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న నివేదికలు సరిగా లేకపోవడంతో రెండ్రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. మధ్యప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు రాకేశ్‌ సింగ్, ఛత్తీస్‌గఢ్‌ పార్టీ చీఫ్‌ ధరమ్‌ కౌశిక్, రాజస్తాన్‌ అధ్యక్షుడు మదన్‌ సైనీలతో అమిత్‌ షా వేర్వేరుగా సమావేశమయ్యారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్, బీఎస్పీ పొత్తు ఏర్పడితే ఇది బీజేపీ విజయావకాశాలపై పెను ప్రభావాన్నే చూపించనుందని.. ఈ రాష్ట్రాల్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 5–8% ఓట్లు పొందిన విషయాన్ని షా గుర్తుచేశారు. ఈ దిశగా వివిధ మార్గాలపై ఆయన చర్చించారు. అగ్రవర్ణ ఓట్లను పొందడంతోపాటుగా.. ఓబీసీలు, రైతుల నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న పట్టును కొనసాగించడంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రాజస్తాన్‌లో ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకతకు తీసుకోవాల్సిన చర్యలను పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం జైపూర్‌ వెళ్లనున్న షా.. జైపూర్, దౌసా, అల్వార్‌ తదితర జిల్లాల్లోని 35 నియోజవర్గాల నేతలతో సమావేశమై మరిన్ని సూచనలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు