ఉద్ధవ్‌తో అమిత్‌ షా భేటీ

7 Jun, 2018 02:14 IST|Sakshi
ముంబైలో ఉద్ధవ్‌ ఠాక్రేతో అమిత్‌ షా, చిత్రంలో సీఎం ఫడ్నవిస్, ఆదిత్య ఠాక్రే

వరుస ఓటముల నేపథ్యంలోనే షా వస్తున్నారన్న ‘సామ్నా’

మాధురి దీక్షిత్‌తోనూ షా భేటీ  

ముంబై: బీజేపీ, శివసేన మధ్య వైరుధ్యాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బుధవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేతో సమావేశమయ్యారు. ముంబైలోని ఉద్ధవ్‌ నివాసం మాతోశ్రీలో జరిగిన ఈ భేటీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే బీజేపీ ప్రారంభించిన ‘మద్దతు కోసం కలుసుకోవడం’ (సంపర్క్‌ సే సమర్థన్‌) కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన పార్టీ అధ్యక్షుడితో ఈ భేటీ జరిగింది. 

అమిత్‌ షా పర్యటన రోజే బీజేపీపై సామ్నా సంపాదకీయంలో శివసేన విమర్శల దాడి చేసింది. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఎన్డీయే పక్షాలను బీజేపీ చీఫ్‌ కలవాలనుకోవడంలో ఆంతర్యమేంటని అందులో ప్రశ్నించింది. ‘ఇటీ వలి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. అందుకే మళ్లీ మిత్రపక్షాలను కలవాలని యత్నిస్తోంద’ని పేర్కొంది. సంపర్క్‌ సే సమర్థన్‌ కార్యక్రమంలో భాగంగా అమిత్‌ షా ముంబై పర్యటనలో సీఎం ఫడ్నవిస్‌తో కలిసి.. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్‌ శ్రీరామ్‌లను జుహూలోని మాధురి నివాసంలో కలిశారు.   

ఫడ్నవిస్‌ వద్దు... ఉద్ధవ్‌: ‘మాతోశ్రీ’కి అమిత్‌ షా, ఫడ్నవిస్‌ వచ్చిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మాతోశ్రీ’లో షా, ఉద్ధవ్‌ చర్చలకు సిద్ధమవుతుండగా.. ఫడ్నవిస్‌ను ఈ భేటీకి దూరంగా ఉండాలని ఉద్ధవ్‌ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రెండో అంతస్తులో ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడుతుండగా.. ఫడ్నవిస్‌ ఒక్కరే మొదటి అంతస్తులో కూర్చున్నారు. అయితే, బుధవారం ఉదయమే అమిత్‌ షాకు ఉద్ధవ్‌ సందేశాన్ని పంపించారని.. షా ఒక్కరినే తను కలుస్తానని అందులో పేర్కొన్నారని శివ సేన వర్గాలు వెల్లడించాయి. మొన్నటి మార్చి లో సచివాలయంలో రెండుగంటలపాటు వేచిచూసినా ఫడ్నవిస్‌ కలవకపోవడం, ఇటీవలి పాల్ఘర్‌ ప్రచారంలో ఉద్ధవ్, ఫడ్నవిస్‌ వ్యక్తిగత విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు