చంద్రబాబుకు దారుణ ఓటమి తప్పదు: అమిత్‌ షా

11 Feb, 2019 19:26 IST|Sakshi

ఏపీ ప్రజలకు అమిత్‌ షా బహిరంగ లేఖ

సాక్షి, న్యూఢిల్లీ:  వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదన్న భయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేక విషయాల్లో యూటర్న్‌ తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఏపీ ప్రజలకు ఆయన సోమవారం బహిరంగ లేఖను రాశారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కనీసం గౌరవించలేని విజ్ఞత లేని వ్యక్తి చంద్రబాబు అని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్ పంచన చేరి చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు.

‘‘ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోరిన వారిని ఆయనే అరెస్ట్‌ చేయించాడు. హోదా పొందిన రాష్ట్రాలు ఏమీ బాగుపడలేదని చంద్రబాబు గతంలో అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు. మాటలు మార్చే వ్యక్తులకు చంద్రబాబు పెద్ద ఉదాహరణ. అబద్ధాలు చెప్పే సంస్కృతిని చంద్రబాబు అమలు చేస్తున్నారు. ఊసరవెల్లి సిగ్గుపడేలా చంద్రబాబు రంగు మారుస్తున్నారు. విభజన చట్టంలోని అనేక వాగ్దానాలను నాలుగేళ్లలో మా ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేకపోయింది. చంద్రబాబులో ఇంకా కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుంది. సత్యమేవ జయతే’’ అంటూ అమిత్ షా లేఖను ముగించారు.

>
మరిన్ని వార్తలు