కాషాయకోటకు కొత్త రాజు

25 Mar, 2019 06:58 IST|Sakshi

గాంధీనగర్‌.. ఈ లోక్‌సభ నియోజకవర్గం పేరు వినగానే ఠక్కున అడ్వానీ గుర్తుకొస్తారు. బీజేపీకి మార్గదర్శి. రాజకీయ కురువృద్ధుడు అయిన అడ్వాణీ ఈ నియోజకవర్గం నుంచి వరసగా ఆరుసార్లు గెలిచారు. ఎప్పుడూ లక్షకు తక్కువ మెజారిటీ రాలేదు. టీఎన్‌ శేషన్, రాజేష్‌ ఖన్నా, మల్లికా సారాభాయ్‌.. ఇలా ప్రత్యర్థులెంతటివారైనా విజయం మాత్రం అడ్వాణీదే. కమలదళానికి కంచుకోట అయిన గాంధీనగర్‌కు రాజు అడ్వాణీ. ఇదంతా ఇప్పుడు ‘గత చరిత్ర’. గాంధీనగరానికి కొత్త రాజు రాబోతున్నారు. ఆయనే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. లోక్‌సభలో అడుగుపెట్టేందుకు ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన అడ్వానీకి ఎలక్షన్‌ మేనేజర్‌గా పని చేసిన అమిత్‌షా ఇప్పుడిక్కడి నుంచే పోటీ చేస్తుండటం విశేషం.

అమిత్‌షాకు గాంధీనగర్‌ నియోజకవర్గం కొత్తేమీ కాదు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన సర్ఖేజ్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నారన్‌పుర శాసనసభ నియోజకవర్గాలు రెండూ గాంధీనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అమిత్‌ షా చాలా ఏళ్లు నారన్‌పుర నియోజకవర్గ పరిధిలో నివసించారు. పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు చాలామంది ఆయనకు బాగా తెలుసు. ఆ పరిచయాలతోనే అడ్వాణీ విజయానికి అమిత్‌షా బాటలు వేశారు.

అప్పటి నుంచే పోటీకి బీజం..
గాంధీనగర్‌లో అమిత్‌షాను నిలబెట్టడమన్నది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయమేం కాదు. చాలా కాలంగా తెరవెనుక దానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన హర్షద్‌ పటేల్‌ను గాంధీనగర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించడంతో దీనికి బీజం పడింది. గాంధీనగర్‌ నుంచి అమిత్‌షా పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలంతా పట్టుబడుతున్నారంటూ మార్చి 16న జరిగిన బీజేపీ స్క్రీనింగ్‌ కమిటీ వెల్లడించింది. దాంతో అమిత్‌షా అభ్యర్థిత్వం ఖరారయింది. దీనిపై గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పందిస్తూ ‘ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ వాడు కావడం మాకెంతో గర్వంగా ఉంది. ఇప్పుడు అమిత్‌షా కూడా గుజరాత్‌ నుంచే లోక్‌సభకు వెళ్తుండటం పార్టీ కార్యకర్తల్ని ఉత్కంఠకు గురిచేస్తోంది’ అన్నారు.

వాజ్‌పేయి, అడ్వాణీ సరసన..
ఈ ఎన్నికల్లో అమిత్‌షా గెలిస్తే, నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని వాజపేయి, అడ్వానీల సరసన షా కూడా చేరతారు. అమిత్‌ షా ఇంత వరకు ఎన్నికల్లో  ఓటమినెరుగరు. సర్ఖేజ్‌ నుంచి మూడుసార్లు (1998, 2002, 2007) అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత నారన్‌పురా నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ వ్యూహకర్తగానే కాకుండా అమిత్‌షా గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. గాంధీనగర్‌ నియోజకవర్గంలో ఈ సంఘం ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తోంది.

గాంధీనగర్‌ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులు.. పార్టీ
1967ఎస్‌ఎం సోలంకికాంగ్రెస్‌
1971 ఎస్‌ఎం సోలంకికాంగ్రెస్‌(ఓ)
1977 పీజీ మావలంకర్‌భారతీయ లోక్‌దళ్‌
1980 ఏఎం పటేల్‌కాంగ్రెస్‌
1984 జీఐ పటేల్‌కాంగ్రెస్‌
1989 విఎస్‌ లక్ష్మణ్‌జీబీజేపీ
1991 ఎల్‌కే అడ్వాణీబీజేపీ
1996 ఏబీ వాజ్‌పేయిబీజేపీ
1998 - 2014  అడ్వాణీ బీజేపీ

మరిన్ని వార్తలు