అమిత్‌ షా వ్యూహం అదేనా?

20 Mar, 2018 19:59 IST|Sakshi
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా (పైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన కమళ దళం కొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే  ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10 రాజ్యసభ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. గతంలో గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌ పటేల్‌ ఎన్నికను నిలువరించాలని తీవ్రంగా యత్నించి భంగపడ్డ విషయం తెలిసిందే. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యూపీ విషయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టి  సారించారు.

యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులను ఎన్నుకోవాల్సి ఉంది. కాగా ఒక్కో అభ్యర్ధి విజయానికి  37 ఎమ్మెల్యేల మద్ధతు కావాల్సివుంది. 300 పైగా అసెంబ్లీ సీట్లు ఉన్న బీజేపీ మొదట ఎనిమిది అభ్యర్ధులను బరిలో నిలపగా, విపక్షాల అవకాశానికి గండి కొట్టాలని చివరి నిమిషంలో మరో అభ్యర్ధిని కూడా పోటిలో నిలిపింది.  47 సభ్యులున్న ఎస్‌పీ, 19 మంది సభ్యులున్న బీఎస్‌పీలు చెరో అభ్యర్థిని బరిలో నిలిపాయి.

షా వ్యూహం ఇదేనా? ఇక బీజేపీకి చెందిన ఎనిమిది  అభ్యర్థుల విజయం లాంచనమే కాగా, తొమ్మిదో అభ్యర్ధి విజయం కోసం విపక్ష పార్టీ సభ్యులపై బీజేపీ గాలం వేయటం ప్రారంభించింది. ముఖ్యంగా బీఎస్‌పీ అభ్యర్థి విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నదే షా వ్యూహంగా కనిపిస్తోంది.  19 మంది సభ్యులున్న బీఎస్‌పీకి.. కాంగ్రెస్‌ మద్ధతు ప్రకటించింది. అది పోనూ మరో 11 మంది సభ్యుల మద్దతు కావల్సి ఉండగా.. ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీ సభ్యుల మద్ధతు ఉంటుందని మాయావతి ప్రకటించారు కూడా.

పార్టీల సమాలోచనలు.. బీఎస్‌పీ అభ్యర్ధి గనక గెలిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీతో కూటమి ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే అమిత్‌షా సమాలోచనలు చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తొమ్మిదో అభ్యర్ధిని బరిలో నిలిపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఇది గమనించిన విపక్షాలు క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా జాగ్రత్తపడుతున్నాయి. తమ అభ్యర్థుల విజయానికి బీజేపీ గండికొట్టాలని చూస్తోందంటూ ఎస్‌పీ, బీఎస్‌పీలు బహిరంగ ఆరోపణలకు దిగాయి.

మరిన్ని వార్తలు