కశ్మీర్‌లోని పరిస్థితిని అర్థం చేసుకోండి

1 Jul, 2019 15:57 IST|Sakshi

రాష్ట్రపతి పాలన తీర్మానానికి మద్దతివ్వండి

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుతోపాటు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించే తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకొని బిల్లుకు, తీర్మానానికి రాజ్యసభ మద్దతు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగింపునకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలుపగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్‌ పండుగ, అమర్‌నాథ్‌ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ విప్లవ్‌ ఠాకూర్‌ కేంద్రం తీరును తప్పుబట్టారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. త్వరలో అమర్‌నాథ్‌ యాత్ర ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే తెలిపారు.

మరిన్ని వార్తలు