కిషన్‌ రెడ్డికి అమిత్‌ షా మందలింపు

1 Jun, 2019 19:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు హైదరాబాద్‌ నగరం సేఫ్‌ జోన్‌గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అమిత్‌ షా... కిషన్‌ రెడ్డిని మందలించారు. ఇకపై ఇలాంటి కామెంట్లు మానుకోవాలని షా సూచించారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఉగ్రవాద కార్యకలపాలకు హైదరాబాద్‌ సేఫ్‌ జోన్‌గా మారిందని అన్నారు.

‘‘దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా లేక పొరుగు దేశాల్లో జరిగినా కూడా దానికి ప్లానింగ్, కుట్ర హైదరాబాద్‌లో జరుగుతోంది. దేశ, విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వచ్చి సేఫ్‌ జోన్‌గా భావించి స్లీపర్‌ సెల్స్‌లా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిసారీ జాతీయ స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు రావడం, హైదరాబాద్‌లో అనుమానితులను అరెస్టులు చేయడం చూస్తున్నాం. మరోవైపు ఐసిస్‌ కార్యకలాపాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించేవి. మయన్మార్‌ నుంచి వేలాది మంది చొరబాటుదారులు (రోహింగ్యాలు) హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్నారు. వారికి కొన్ని సంస్థలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి’’అంటూ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు