పొత్తులుండవ్‌...!

16 Sep, 2018 05:41 IST|Sakshi
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా

బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీల సమావేశంలో అమిత్‌ షా

119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల్సిందే..

అన్నీ నేను చూసుకుంటా... ఏడాది నుంచి చెబుతున్నా పట్టించుకోకుంటే ఎలా?

ఇప్పటికైనా మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి.. మేము చేయాల్సింది చేస్తాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగిన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ సంస్థాగత తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్య నేతలకు చురకలు అంటించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, అందుకు తగినట్లుగా పార్టీని సిద్ధం చేయాలని దాదాపు ఏడాది నుంచి సూచిస్తున్నప్పటికీ రాష్ట్ర నేతలు సరిగ్గా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, అతి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించేందుకు బూత్‌ స్థాయి నుంచి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీకి కేవలం 2 శాతం ఓటింగ్‌ ఉన్న త్రిపురలో అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో కూడా ఆ దిశగా పార్టీ గెలుపునకు కృషి చేయాలని అధినేత హితబోధ చేశారు. బీజేపీ పొత్తులపైన కూడా అధినేత పూర్తిస్థాయి స్పష్టతనిచ్చారు.

‘నేను అమిత్‌షా గా చెబుతున్నా.. తెలంగాణలో మనం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తప్పకుండా పోటీ చేయాల్సిందే. అందుకు పార్టీ నాయకత్వమంతా సిద్ధం కావాలి. పొత్తులపై ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే ఇప్పుడే చెప్పండి’అంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు. పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారని వివరించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తాను కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తరచూ రాష్ట్రానికి వస్తుంటానని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. బూత్‌ స్థాయిలో పార్టీ ప్రచారం పక్కాగా చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యాలను ఎండగట్టాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన సంక్షేమ పథకాలను, ఆర్థిక ప్రయోజనాలను ప్రజలకు వివరంగా చెప్పాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలు కలెక్టరేట్లు దాటి ప్రజల్లోకి వెళ్లలేదని అమిత్‌ షా అన్నారు. వీటిని కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో నేతలు, కిందిస్థాయి నాయకత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందో తనకు తెలియజేస్తే సరిపోతుందన్నారు.

మరిన్ని వార్తలు