‘అస్సాంను మరో కశ్మీర్‌ కానివ్వం’

17 Feb, 2019 17:29 IST|Sakshi

లఖింపూర్‌(అస్సాం): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అస్సాంను మరో కశ్మీర్‌ కానివ్వమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అందుకోసమే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) తీసుకొచ్చామని అన్నారు. చోరబాటుదారులను గుర్తించటానికి ఎన్‌ఆర్‌సీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదివారం అస్సాంలోని లఖింపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అస్సాంను మరో కశ్మీర్‌ కానివ్వబోము. అందుకోసమే ఎన్నిసార్లైనా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను చేపట్టడానికైనా సిద్ధం. విదేశాల నుంచి వచ్చి అస్సాంలో తలదాచుకుంటున్న వారిని తరిమికొట్టేవరకు ఈ ప్రక్రియను చేపడతామ’ని తెలిపారు.  అలాగే కాంగ్రెస్‌తో పాటు గతంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న అస్సాం గణ పరిషత్‌పైన కూడా అమిత్‌ షా విమర్శల వర్షం కురిపించారు. వివాదస్పద పౌరసత్వ (సవరణ) బిల్లు కేవలం ఈశాన్య ప్రాంతాలకే పరిమితం కాదని.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు వర్తిస్తుందని వెల్లడించారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం జనాభాలో మార్పు వస్తుందని.. లేకపోతే అస్సాం ప్రజలు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందన్నారు.

పుల్వామా ఉగ్రదాడిని పాకిస్తాన్‌ తీవ్రవాదులు జరిపిన పిరికిపంద చర్యగా అమిత్‌ షా అభివర్ణించారు. జవాన్ల త్యాగం వృథా కాదని.. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీపడదని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు