అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి

23 Feb, 2019 03:24 IST|Sakshi

ఆయన ఓ అబద్ధాల షా

హవాలా డబ్బు కోసమే జగన్‌ లండన్‌ పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

సాక్షి, అమరావతి: తాను పాకిస్తాన్‌ ప్రధానమంత్రిని విశ్వసిస్తున్నానని, భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు చూపాలని లేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైనికుల చావులను టీడీపీ, టీఎంసీ, కాంగ్రెస్‌ రాజకీయం చేస్తున్నాయని అమిత్‌ షా అనడమే నీచ రాజకీయమన్నారు.

పుల్వామా ఉగ్రదాడి ఇంటెలిజెన్స్‌ వైఫల్యంవల్ల జరిగిన దుర్ఘటన అని తెలిపారు. 2013లో బీహార్, కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలనే తాను గుర్తుచేశానని, ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని రాజీనామా చేస్తారా అని ప్రశ్నించానన్నారు. తనకేమీ పట్టనట్లు డిస్కవరీ ఛానల్‌ షూటింగ్లో మోదీ మూడు గంటలు గడిపినట్లు మీడియాలో వచ్చిన దానిపై ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
 
జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే మద్దతు
ఇదిలా ఉంటే.. జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టీడీపీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు ఎవరికి వారే పోటీచేస్తామని చెప్పారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్‌ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో శుక్రవారం ఉండవల్లి నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చి అవాకులు చవాకులు మాట్లాడారని, రాష్ట్రానికి గత ఐదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అమిత్‌ షా కాదు అతను అబద్దాల షా అని విమర్శించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దొంగే, దొంగా.. దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తోందని, వాళ్లు చేసే తప్పుడు పనులు ఇతరులకు ఆపాదిస్తారని విమర్శించారు.  హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరన్నారు. కాగా, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల సమీక్ష పూర్తిచేశామని, నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిందన్నారు.

మరిన్ని వార్తలు