ఒక్క చాన్స్‌ ఇవ్వండి

26 Nov, 2018 01:38 IST|Sakshi
దుబ్బాక సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ

ఐదేళ్లలో తెలంగాణను మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం  

నిర్మల్, పరకాల, నారాయణఖేడ్, దుబ్బాక సభల్లో అమిత్‌ షా  

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌/వరంగల్‌ రూరల్‌/సంగారెడ్డి/సిద్దిపేట: ‘ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి పట్టం కట్టండి’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే తెలంగాణను మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంతోపాటు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గ కేంద్రం, సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు.

ఆయా సభల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ హవాకు భయపడే సీఎం కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యలను కేసీఆర్‌ పట్టించుకోలేదని, ఒవైసీ సోదరులకు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని, రాష్ట్రానికి కేంద్రం రూ. 2.30 లక్షల కోట్ల నిధులిచ్చినా రాష్ట్ర ప్రజలపై రూ. 2 లక్షల కోట్ల అప్పుల భారం మిగిల్చారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు మతప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమిత్‌ షా ప్రసంగాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలుగులో అనువదించారు. అమిత్‌ షా ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

నిర్మల్‌ సభలో... 
హామీలన్నీ ఏమయ్యాయి..? 
అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ ఏమైంది? కనీసం భవిష్యత్‌లోనైనా చేసే ఉద్దేశం టీఆర్‌ఎస్‌కు ఉందా? ఇంటింటికీ గోదావరి నీళ్లు ఇస్తామన్న పని ఇప్పటివరకు కేవలం 32 శాతమే పూర్తయింది. ఇంకా 68 శాతం కాలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇస్తామన్న లక్ష 7 వేల ఉద్యోగాలు ఏమయ్యాయి? నాలుగున్నరేళ్లలో భర్తీ చేస్తామన్న మరో లక్షా 50 వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? నాలుగున్నరేళ్లలో తెలంగాణవ్యాప్తంగా 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే 130 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒవైసీ బ్రదర్స్‌తో కలసి బిర్యానీ తినేందుకు కేసీఆర్‌కు సమయం ఉంది కానీ.. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన 65 మంది బాధిత కుటుంబాలను పరామర్శించే సమయం ఆయనకు లేదా? తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో అమరులైన కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ కనీసం ఆ మాట కూడా మాట్లాడటం లేదు. దళితులకు 3 ఎకరాల చొప్పున చేస్తామన్న భూ పంపిణీ ఇప్పటికీ అమలు కాలేదు. 

పరకాల సభలో... 
ఎవరి రిజర్వేషన్లకు కోత పెడతావ్‌...? 
మతపరమైన రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతాం. మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదని రాజ్యాంగం చెప్తోంది. విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శా తానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వదలచుకుంటే ఓబీçసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎసరు పెడతారా? దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ అమ లు చేయదు. మిమ్మల్ని అమలు చేయనివ్వదు. 

తెలంగాణకు కేంద్రం రూ. 2.30 లక్షల కోట్ల నిధులు 
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 13వ ఆర్థిక సంఘం రూ. 16,500 కోట్ల నిధులు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా 2014–2018 వరకు రూ. 1,15,605 కోట్ల నిదులిచ్చింది. గతంతో పోలిస్తే ఏడు రేట్లు అధికంగా నిధులు కేటాయించింది. ముద్ర బ్యాంకు రుణాలకు రూ. 15,000 కోట్లు, స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి రూ. 124 కోట్లు, అమృత్‌ మిషన్‌ పథకం కోసం రూ. 834 కోట్లు, రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 19,932 కోట్లు, అర్బన్‌ మిషన్‌ కోసం రూ. 1,150 కోట్లు, ప్రధానమంత్రి యోజనకు రూ. 1,221 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 900 కోట్లు, జాతీయ రహదారుల కోసం రూ. 14,800 కోట్లు కేటాయించిన ఘనత బీజేపీదే. నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ 2,30,800 కోట్ల నిధులిచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపింది. 

నారాయణఖేడ్‌ సభలో... 
మోదీ హవాకు భయపడే ‘ముందస్తు’కు... 
లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రధాని మోదీ హవా ముందు ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కొడుకు లేదా కూతురిని సీఎం చేసేందుకు కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తద్వారా తెలంగాణ ప్రజానీకంపై రూ. 500 కోట్ల భారం మోపారు. 

రైతులకు బేడీలు వేశారు... 
ఖమ్మంలో పంట దిగుబడికి మద్దతు ధర కోరిన రైతులను కేసీఆర్‌ ప్రభుత్వం బేడీలు వేసి ఊరేగించింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పంటల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పేదలకు అందకుండా కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డుకుంది. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చలేదు. నారాయణఖేడ్‌ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కేసీఆర్‌కు తీరిక దొరకడం లేదా?

కాంగ్రెస్, కమ్యూనిస్టుల శకం ముగిసింది... 
తెలంగాణలో మహాకూటమికి రాహుల్‌ బాబా నాయకుడు. ఆయన ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌ ఓడిపోతోంది. దేశంలో కాం గ్రెస్‌ ఎక్కడ మిగిలి ఉందో దుర్భిణి వేసి వెతకాల్సిన పరిస్థితి. రాహుల్, చంద్రబాబు, సీపీఐ నేతృత్వంలోని కూటమి తెలంగాణకు మేలు చేయలేదు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, దేశం లో కాంగ్రెస్‌ శకం ముగిసిపోయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే సత్తా బీజేపీకే ఉంది. 

దుబ్బాక సభలో... 
మజ్లిస్‌ను కట్టడి చేసే ధైర్యం బీజేపీకే ఉంది... 
మజ్లిస్‌ దాదాగిరిని అడ్డుకునే దమ్ము, ధైర్యం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఒవైసీ సోదరుల ఒత్తిడికి తలొగ్గిన ముఖ్యమంత్రి సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా జరిపేందుకు భయపడుతున్నారు. ఒవైసీ సోదరుల దూకుడుకు అడ్డుకట్ట వేసేది ఒక్క బీజేపీ మాత్రమే. 2012లో అక్బరుద్దీన్‌ ఒవైసీ హిందూ దేవతలను అవమానించారు. దీనిపై కేసు నమోదైనా కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరికి భయపడి కేసీఆర్‌ అక్బరుద్దీన్‌ కేసును పట్టించుకోవడం లేదు? కేసీఆర్‌కు దమ్ముంటే డిసెంబర్‌ 7లోగా ఈ కేసుపై చర్యలు తీసుకోవాలి. 

ప్రపంచవ్యాప్తంగా మోదీ జపం... 
ప్రధాని మోదీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ గౌరవం మోదీకి, బీజేపీకి వచ్చింది కాదు... యావత్‌ భారత దేశ ప్రజలకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సరిహద్దుల్లో భద్రత పెరిగింది. దేశ ప్రజలకు ధీమా వచ్చింది. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. అంటే 70 శాతం భూభాగం బీజేపీ పాలనలో ఉంది. 

పీవీని అవమానించి తెలంగాణ ఆత్మగౌరవంపై మాట్లాడతారా?  
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం గురించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ బాబా తెగ చెప్పుకుంటున్నారు. మరి మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావును అవమానించింది మీరు కాదా? కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘంగా పని చేసి దేశ ప్రధానిగా పని చేసిన తెలంగాణ బిడ్డ పీవీ మరణిస్తే ఆయన పార్థివదేహానికి కూడా కనీస మర్యాద ఇవ్వలేదు. పీవీని గౌరవించలేని మీరు ఇప్పుడు తెలంగాణపై మొసలి కన్నీరు కార్చడం శోచనీయం. 

మరిన్ని వార్తలు