హామీలు నెరవేర్చని కేసీఆర్‌

26 Nov, 2018 07:45 IST|Sakshi
నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి నివాదాలు చేస్తున్న అమిత్‌షా

నిర్మల్‌: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం, ప్రిన్స్‌ హైస్కూల్‌ మధ్య గల మైదానంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ‘మేరే సాథ్‌ బోలియే.. భారత్‌ మాతాకీ జై..’ అంటూ అమిత్‌షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2.10నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించి, 24నిమిషాల పాటు ఏకధాటిగా, ఉత్సాహభరితంగా మాట్లాడారు. అమిత్‌షా హిందీలో మాట్లాడగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలుగు అనువాదం చేశారు. అమిత్‌షా మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంతాన్ని నిర్మించిన నిమ్మనాయుడు, ఆయనకు దారి చూపిన కంచర్ల రామదాసుకుప్రణామాలు చెబుతున్నానన్నారు. ఒకప్పుడు షుగర్, ఐరన్, స్పిన్నింగ్‌ తదితర ఆరేడు పరిశ్రమలు నిర్మల్‌ ప్రాంతంలో ఉండేవన్నారు.

ఇప్పుడు అవన్నీ కనుమరుగు కావడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మార్పు కోసం, మంచి భవిష్యత్‌ కోసం బీజేపీకి పట్టంకట్టాలని కోరారు. నిర్మల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్‌ అయిండ్ల సువర్ణారెడ్డి, ముథోల్‌ అభ్యర్థి డాక్టర్‌ రమాదేవి, ఖానాపూర్‌ అభ్యర్థి సట్ల అశోక్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో నిర్మల్‌ ప్రాంత ప్రాముఖ్యత పెరగాలంటే బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీజేపీకి పట్టం కట్టండన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే తెలంగాణను మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల పాలనలో ఈ ప్రాంత భవిష్యత్‌ కుంటుపడిందన్నారు.

2012 నుంచి   నిర్మల్‌ పేరు వింటున్నా..
తాను 2012 సంవత్సరం నుంచే నిర్మల్‌ పేరును వింటున్నానని అమిత్‌ షా అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  హిందూ దేవతలను అవమానించడాన్ని ఇప్పటికీ మరచిపోలేమన్నారు. ఆ సంఘటన నేపథ్యంలో ఓవైసీపై కేసు నమోదు అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేసీ ఆర్‌ ఎవరికి భయపడి కేసుపైన చర్యలు తీసుకోవ డం లేదని ప్రశ్నించారు. రజాకార్లు, మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఎంఐఎంకు భయపడే టీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు.
 
హామీలను నమ్మి గెలిపిస్తే...
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని అమిత్‌షా ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కనీసం భవిష్యత్‌లోనైనా చేసే సంకల్పం ఉందా అని అడిగారు. ఇంటింటికి గోదావరి నీళ్లు ఇస్తామన్న పని ఇప్పటివరకు కేవలం 32శాతం పూర్తి అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇస్తామన్న లక్ష7వేల ఉద్యోగాలతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో భర్తీ చేస్తామన్న మరో లక్ష50వేల ఉద్యోగాలు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించా రు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 4,500మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సీఎం సొంత నియోజకవర్గమైన ఒక్క గజ్వేల్‌లోనే 130మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు.

తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాల్లో అమరులైన వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ మాటమార్చారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు మరచిపోయారన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ బిడ్డలపై పట్టింపు లేదని, తన కొడుకు, కూతురుపైనే చింత ఉందని విమర్శించారు. గిరిజనలతో కలిపి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కేసీఆర్‌ ప్రతిపాదించారని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదని తెలిసినా టీఆర్‌ఎస్‌ ఈ పని చేసిందని మండిపడ్డారు. రాహుల్‌ బాబా ఎక్కడికి వెళ్లి ప్రచారం చేసినా ఓటమి పాలయ్యారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్, ప్రపంచంలో కమ్యూనిస్టులు కనుమరుగయ్యారని ఎద్దెవా చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే దేశంలో మోడ ల్‌ స్టేట్‌గా తెలంగాణను చేస్తామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. చివరకు భారత్‌ మాతాకీ జై.. అంటూ మూడుసార్లు సభికులందరితో అనిపించి ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జిల్లా అధ్యక్షురాలు, ముథోల్‌ అభ్యర్థి రమాదేవి, నిర్మల్, ఖానాపూర్‌ అభ్యర్థులు డాక్టర్‌ సువర్ణారెడ్డి, సట్ల అశోక్, రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, జిల్లా నాయకులు సామ రాజేశ్వర్‌రెడ్డి, అంజుకుమార్‌రెడ్డి, ఒడిసెల శ్రీనివాస్, రచ్చ మల్లేష్, రాచకొండ సాగర్, శ్రావణ్‌రెడ్డి, పత్తిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, అయిండ్ల భూపాల్‌రెడ్డి, కుంట శ్రీనివాస్, రాజేంధర్, సత్యనారాయణ, బాబా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు