తూటాకు తూటాతోనే సమాధానం

7 Mar, 2019 03:59 IST|Sakshi
బుధవారం నిజామాబాద్‌ సభలో అభివాదం చేస్తున్న అమిత్‌ షా. చిత్రంలో లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు

కాంగ్రెస్‌ మిత్రపక్షాలకు ఆ దమ్ముందా? 

పాకిస్తాన్‌ ఉగ్రవాదంపై అమిత్‌ షా ప్రశ్న

క్లిష్ట పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సిందిపోయి ఆధారాలు అడుగుతారా? 

చంద్రబాబు మాటలు, పాకిస్తాన్‌ మీడియావి ఒకేలా ఉన్నాయి

బీజేపీ పాలనలోనే దేశం సురక్షితం..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పాకిస్తాన్‌కు తాము తూటాకు తూటాతోనే సమాధానం చెప్పామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే ఉగ్ర వాదానికి తమలా దీటైన సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ఐదు పార్లమెంట్‌ స్థానాల బీజేపీ క్లస్టర్‌స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి పరాయి దేశానికి వత్తాసు పలికేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో వాయుసేన పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తగిన గుణపాఠం చెబితే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లు సాక్ష్యాలు అడుగుతున్నారని మండిపడ్డారు.

ఈ సర్జికల్‌ స్ట్రైక్‌పై పాకిస్తాన్‌ మీడియా, కాంగ్రెస్‌ మిత్రపక్షాల మాటల తీరు ఒకేలా ఉందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాన్లకు మద్దతివ్వాల్సింది పోయి.. ఆధారాలు అడగడం ఎంత వరకు సమంజసమని షా ప్రశ్నించారు. బీజేపీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు మాత్రమే కాదు, భారత్‌ కూడా సర్జికల్‌స్ట్రైక్‌లు చేయగలదని నిరూపితమైందన్నారు. పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పామని.. ఇది మోదీ నేతృత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి మిత్ర పక్ష పార్టీలకు జెండా, ఎజెండాలు లేవని, సిద్ధాంతాలను పక్కన బెట్టి రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ ఎజెండా ఏమిటో రాహుల్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

మీ ప్రధాని అభ్యర్థి ఎవరు?
బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారనే తాము ప్రకటిస్తున్నామని, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనేది ఎందుకు ప్రకటించడం లేదని షా ప్రశ్నించారు. రోజుకొకరు ప్రధాని అభ్యర్థి అంటూ వాట్సాప్‌లో వైరల్‌ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలతో దేశం సురక్షితంగా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా రాలేదని గుర్తు చేశారు.  

సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరునూ అమిత్‌ షా ఎండగట్టారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 16+1 అంటున్న కేసీఆర్‌ ఓ స్థానం రజాకార్ల పార్టీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబైలలో ఉగ్రమూలాలను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అసాంఘిక శక్తులను ఏరివేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కేసీఆర్, చంద్రబాబు, రాహుల్‌గాంధీల నుంచి సరైన సమాధానం ఆశించలేమని అన్నారు.

ఈ ఎన్నికలు సీఎంను ఎన్నుకునేందుకు కావని, ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 2.45 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని అమిత్‌ షా వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అరవింద్‌ లింబావలి, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ధర్మపురి అర్వింద్, మంత్రి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో గెలుపు అవకాశాలు: లక్ష్మణ్‌
నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నిజాంషుగర్స్‌ పునరుద్ధరణ వంటి హామీల అమలులో కేసీఆర్‌ సర్కారు విఫలమైందని ఆయన మండిపడ్డారు. దేశాన్ని పాలించేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ సామర్థ్యం కేవలం మోదీకి మాత్రమే ఉందని ఉద్ఘా టించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 16+1 అంటూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు