శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం : షా

1 Oct, 2019 17:57 IST|Sakshi

కోల్‌కతా : దేశ వ్యాప్తంగా త్వరలోనే జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్నార్సీ)ను చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ అన్నారు. చొరబాటు దారులను ఎట్టి పరిస్థతుల్లో దేశంలో ఉండనివ్వమని.. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని షా తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంత వ్యతిరేకించినా.. బీజేపీ కచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందని అన్నారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజలో అమిత్‌ షా పాల్గొన్నారు. ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నార్సీపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న షా.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడానికే చోరబాటుదారులకు మమత మద్దతుగా నిలుస్తుందని ఆరోపించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాలు సాధించడంలో బెంగాల్‌ కీలక భూమిక పోషించిందని అన్నారు. బెంగాల్‌లో బీజేపీ బయటి పార్టీ కాదని షా అన్నారు. దేశ విభజన సమయంలో బెంగాల్‌ మొత్తం పాకిస్తాన్‌తో కలవాలని చూస్తే.. శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోరాడి పశ్చిమ బెంగాల్‌ భారత్‌లోనే ఉండేలా చేశారని తెలిపారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేశామని.. తద్వారా శ్యామ ప్రసాద్‌ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారని చెప్పారు.

చొరబాటుదారులు వామపక్షాలకు ఓటు వేసిన సమయంలో మమత వారిని వ్యతిరేకించారని.. ఇప్పుడు వారు టీఎంసీకి మద్దతు తెలుపడంతో ఆమె వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నార్సీ అమలు కాకుండా చూస్తామని మమత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షా.. బెంగాల్‌లో ఒక్క చొరబాటు దారున్ని కూడా ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే..
టీఎంసీ ఎమ్మెల్యే సవ్యాసాచి దత్తా మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా