ఢిల్లీకి రండి : ఖట్టర్‌కు అమిత్‌ షా పిలుపు

24 Oct, 2019 12:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేపట్టింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహల్‌ లాల్‌ ఖట్టర్‌ను సత్వరమే దేశ రాజధాని చేరుకోవాలని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కోరారు. 90 స్ధానాలు కలిగిన హరియాణాలో మేజిక్‌ మార్క్‌కు కొద్దిస్ధానాలు తక్కువగా 41 స్ధానాల్లోనే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ఏ పార్టీకి మేజిక్‌ ఫిగర్‌ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్‌ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్‌ మాజీ సీఎం, అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌లకు అప్పగించింది. హరియాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు