అమిత్‌షా పర్యటన.. పొత్తుపై కీలక ప్రకటన!

21 Jun, 2018 19:32 IST|Sakshi
నితీష్‌ కుమార్‌-అమిత్‌ షా

పాట్నా: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా బిహార్‌లో పర్యటించునున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగి వెడెక్కింది. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపేందుకు అమిత్‌ షా రంగం సిద్ధం చేశారు. జూన్‌ మొదటి వారంలో అమిత్‌ షా బిహార్‌లో పర్యటించి, లోక్‌సభ స్థానాల పంపిణీ విషయంలో కీలక ప్రకటన చేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు. పర్యటనలో భాగంగా సీఎం నితీష్‌ కుమార్‌తో అమిత్‌ షా సమావేశం కానున్నారు. ఈ భేటిలో ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు పంపిణీపై చర్చ జరగనుంది.

సీట్ల పంపకం విషయంలో గత కొద్ది రోజలుగా బీజేపీ, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత రాజేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ మండిపడుతోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల శాతాన్ని బట్టి సీట్ల పంపిణీ జరగాలని, తమకు అత్యధిక స్థానాలు కావాలని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి డిమాండ్‌ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

గత లోక్‌సభ ఎన్నికలో మిత్రపక్షాలతో బీజేపీ కలిసి 31 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 22, ఎల్జ్‌పీ 6, ఆర్‌ఎల్‌ఎస్పీ 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. తాము విజయం సాధించిన 31 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలుపుతామని బీజేపీ మరో ఫార్ములాని తెరపైకి తెచ్చింది. ఈ ఫార్ములాను జేడీయూ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ఫార్ములా ప్రకారం సీట్ల పంపకం జరిగితే జేడీయూకి కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే దక్కే అవకాశముంది. అమిత్‌ షా పర్యటనతో సీట్ల పంపిణీ విషయం ఓ కొలిక్కి వస్తుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు