2019లో భారీ మెజార్టీతో..!

9 Sep, 2018 03:12 IST|Sakshi
జాతీయ కార్యవర్గ సమావేశ వేదికపై జైట్లీ, అమిత్, మోదీ, అడ్వాణీ

సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా

బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని వెల్లడి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులంతా ఏకమై ప్రారంభించనున్న మహాకూటమి ఓ మిథ్య అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో రెండ్రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభోత్సవంలో షా మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేకిన్‌ ఇండియా నినాదంతో ముందుకెళ్తుంటే బ్రేకింగ్‌ ఇండియా లక్ష్యంతో కాంగ్రెస్‌ పనిచేస్తోందన్నారు. 2014లో పార్టీ, కూటమి సాధించిన సీట్లకంటే ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయవాదం అంశాలపై బీజేపీ ఎన్నికల ప్రచారం ఉండాలని కార్యవర్గ సభ్యులకు మోదీ సూచించారు. ‘వరుస ఎన్నికల్లో ఓటమితో ఆత్మరక్షణలో ఉన్న విపక్షాలు అర్బన్‌ నక్సల్స్‌కు మద్దతివ్వడంతోపాటు భారత్‌ను ముక్కలు ముక్కలు (బ్రేకింగ్‌ ఇండియా) చేద్దామని ప్రయత్నిస్తున్నారు’ అని షా అన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్య పదాధికారులు (మొత్తం 175 మంది) హాజరయ్యారు. ఆదివారం జరిగే ముగింపు సమావేశంలో మోదీ ప్రసంగిచనున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రతిపాదించి ఆమోద ముద్ర వేయనున్నారు.  

బెంగాల్, ఒడిశా, తెలంగాణలపై..
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలపై ఉన్న ప్రజావ్యతిరేకత కారణంగా ఎక్కువసీట్లు గెలుస్తామని షా చెప్పారు. 2014లో మొత్తం 543 సీట్లలో బీజేపీ 283 సీట్లు గెలిచింది. ‘బీజేపీ 2014లో ఇప్పుడు ఏకమవుతున్న అన్ని పార్టీలను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు వాళ్లందరూ ఏకమైనా ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మోదీ చరిష్మా, పార్టీ సంస్థాగత బలం కారణంగా మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని షా అన్నారు. ‘కాంగ్రెస్‌ చెప్పిందే మన్మోహన్‌ సింగ్‌ పాటిస్తారు. ఇక్కడ మోదీ ముందుండి నడిపిస్తారు’ అని అన్నారు. పాక్‌పై భారత ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన సెప్టెంబర్‌ 28ని శౌర్యదివస్‌గా జరపాలని, గాంధీజీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.   

వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ..
మాజీ ప్రధాని దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయిని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం స్మరించుకుంది. ఆరోగ్యం సహకరించినదాకా ప్రతీ జాతీయ కార్యవర్గ సమావేశానికి అటల్‌జీ హాజరైన విషయాన్ని స్మరించుకుంది. ‘దేశ ప్రజల ఆకాంక్షలన నెరవేర్చడంలో విశ్వసనీయమైన నేతగా అటల్‌జీ తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. ఆయన చిత్తశుద్ధి, కఠోర శ్రమకారణంగానే ఇది సాధ్యమైంది. సిద్ధాంతాలకు కట్టుబడి ధ్రుఢనిశ్చయంతో ముందుకెళ్లడం ద్వారానే అనుకున్న లక్ష్యాలను ఆయన సాధించగలిగారు’ అని వాజ్‌పేయి సంతాప తీర్మానంలో పేర్కొంది. రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవసాయ తీర్మానాన్ని ఆమోదించింది.

ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఓకే
ఈ సమావేశాల్లో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎలక్షన్లపై చర్చ జరిగింది. ఇప్పటివరకు జరిగిన వివిధ సర్వేలు, పార్టీ అంతర్గత వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌లో ప్రజావ్యతిరేకత ఉందని పార్టీ ఈ సమస్యను దాటుకుని ముందుకెళ్లటం చాలా కష్టమని పార్టీ నివేదికలు చెబుతున్నాయి. రాజస్తాన్‌ సీఎం, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, కీలక మంత్రులు, ఇతర పార్టీ ముఖ్యులతో షా ఆదివారం షా భేటీ కానున్నారు.   పార్లమెంటు ఎన్నికల్లో మోదీ, అమిత్‌  నేతృత్వంలోనూ ముందుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. దీనికితోడు 2019 జనవరిలో పూర్తికానున్న అమిత్‌ షా అధ్యక్ష పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని తీర్మానించారు.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేద్దామనుకునేవారు కచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేసి తమ సత్తా చాటాలని ఆయన తెలంగాణ ముఖ్యనేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే రోజే 35 మందితో తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత 2 దశల్లో మిగిలిన 84 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. వ్యూహాలపై జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం తెలంగాణ నేతలతో వేరుగా ఆయన భేటీ కానున్నారు.

మరిన్ని వార్తలు