6న శంషాబాద్‌కు అమిత్‌షా 

1 Jul, 2019 03:14 IST|Sakshi
అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న లక్ష్మణ్‌. చిత్రంలో జేపీ నడ్డా, మురళీధర్‌రావు తదితరులు

బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి

12 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చడమే లక్ష్యం: లక్ష్మణ్‌   

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 6న తెలంగాణ పర్యటనకు రానున్నారు. శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ ఫంక్షన్‌ హాల్‌లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో జరిగిన రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమిత్‌షా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కృష్ణదాస్, ఎమ్మెల్యే రాజాసింగ్, సీనియర్‌ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్, రామచంద్రరావు, ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు అంశాలపై ప్రధానంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఈనెల 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వారణాసిలో ప్రధాని మోదీ, తెలంగాణలో అమిత్‌షా పాల్గొనాలని నిర్ణయించారు. 

దాడులను ఎదుర్కొంటాం: లక్ష్మణ్‌ 
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్‌ భౌతిక దాడులకు పాల్పడుతోందని లక్ష్మణ్‌ విమర్శించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ చేస్తున్న హత్యారాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే అమిత్‌ షా రాష్ట్రానికి రానున్నారని, ఆగస్టు నుంచి నెలకు ఇద్దరు చొప్పున కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటనకు వస్తారని అన్నారు.

తెలంగాణలో కొత్తగా 12 లక్షల మంది సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సభ్యత్వ నమో దు, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటడం, హూజూర్‌నగర్‌ ఉప ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించామని, ఉపఎన్నికకు బీజేపీ ఇన్‌చార్జ్‌గా పేరాల శేఖర్‌ను నియమించినట్టు ఆయన తెలిపారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలో మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులతో కలసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు