ముస్లింల ద్రోహి చంద్రబాబు

29 Aug, 2018 04:01 IST|Sakshi
మాట్లాడుతున్న రెహమాన్, ఖాదర్‌ బాషా, ఎమ్మెల్యేలు ముస్తఫా, ఆర్కే, రావి వెంకటరమణ, లేళ్ళ అప్పిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయులు, ససీర్‌ అహ్మద్‌

     కేవలం ఓట్లు, సీట్ల కోసమే తెలుగుదేశం పార్టీ డ్రామా

     బడ్జెట్‌లో కేటాయించిన నిధులు 30 శాతమైనా ఖర్చు చేయని సీఎం 

     చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజద్‌బాషా ఫైర్‌

సాక్షి కడప: నాలుగేళ్ల తర్వాత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు రాలేదా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ కూడా ముస్లింలకు కేంద్రంలో మంత్రి పదవి కేటాయించగా ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించలేదు.. ముస్లిం మైనార్టీల ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోవడం తథ్యమన్నారు. కేవలం ఎన్నికలకు ముందు ముస్లిం మైనార్టీలకు ఏదో చేస్తున్నట్లు ఊదరగొట్టి మరోమారు ఓట్ల కోసం మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని.. మంగళవారం రాత్రి ‘సాక్షి’ టీవీ ఫోర్త్‌ ఎస్టేట్‌ లైవ్‌ షోలో ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమం అనంతరం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ గుంటూరులో నారా హమారా.. టీడీపీ హమారా అంటూ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని కేవలం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలోనే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి 200 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చేలా చేసిన నాయకుడు వైఎస్సార్‌ మాత్రమేనని, ఆయనను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబును ఎవరూ నమ్మరని ఆయన విమర్శించారు. భారతదేశంలోనే అవినీతిలో ప్రత్యేక ముద్ర తెచ్చుకుని నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న చంద్రబాబుకే అవినీతి సామ్రాట్‌ బిరుదు ఉందని.. ఆ అవినీతి పుత్రుడు లోకేష్‌బాబు అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ‘సారే ఆంధ్ర ముసల్మాన్‌ కా ఏక్‌ హి... వైఎస్సార్‌ హమారే’ అనేది ముస్లింల నినాదమని టీడీపీ పాలకులు తెలుసుకోవాలన్నారు. 

వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ సీఎం కావడం తథ్యం 
పట్నంబజారు (గుంటూరు): వంద మంది చంద్రబాబులు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎం రెహమాన్‌ స్పష్టం చేశారు. గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని నిఘా వర్గాల ద్వారా తెలిసి, మైనారిటీ వర్గాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వి.ఖాదర్‌ బాషా, ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు టోపీలు పెట్టి ముస్లింలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారని చెప్పే ప్రయత్నాలను చేస్తున్నారని మండిపడ్డారు. 

అధికారం హమారా... ప్రజల డబ్బు దుబారా: ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి నియోజవకర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌ నిర్వహిస్తోంది టీడీపీ హమారా.. నారా హమారా కాదని, అధికారం హమారా.. ప్రజల డబ్బు దుబారా అని విమర్శించారు. సమావేశంలో పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్‌ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్‌ అహ్మద్, మైనారిటీ విభాగం గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ జిలాని, సయ్యద్‌ మాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు