అవినీతి ‘అమూల్‌’ను అంత పొగడడమా?!

4 Oct, 2018 17:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘గర్వంతో నా హదయం ఎంతో ఉప్పొంగిపోతోంది. ఏడు దశాబ్దాల రైతుల సహకారోద్యమం ఫలితం అమూల్‌. ఇదొక గుర్తింపు, ఇదొక స్ఫూర్తి, దేశానికి ఇది ఎంతో అవసరం. పెట్టుబడిదారి విధానానికి, లౌకిక వాదానికి ఇదొక ప్రత్యామ్నాయం’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు గుజరాత్‌లోని ఆనంద్‌లో అమూల్‌ కొత్త చాక్లెట్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ ఉద్వేగంగా చేసిన వ్యాఖ్యలు. దేశంలో రైతుల సహకార ఉద్యమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన అమూల్‌ సహకారోద్యమం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీర్తిని గడించింది. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీనిపైనే ప్రముఖ బాలివుడ్‌ దర్శకుడు శ్యామ్‌ బెనగళ్‌ 1976లో ‘మంథన్‌’ చిత్రాన్ని తీశారు. స్మితా పాటిల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డులు లభించాయి. ఈ చిత్రానికి విజయ్‌ టెండూల్కర్, ఖైఫీ ఆజ్మీ స్క్రీన్‌ ప్లే అందించారు.

వర్తమాన చరిత్రంతా అవినీతి మయమే
ఇది అమూల్‌ గత చరిత్ర. వర్తమాన చరిత్రంతా అవినీతి మయమే. ముఖ్యంగా 2013 సంవత్సరం నుంచి అమూల్‌ ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది. అమూల్‌ పరిధిలోని మొత్తం 18 మిల్క్‌ యూనియన్లలో నాలుగు ప్రధాన యూనియన్లో ఒకటైన కైరా యూనియన్‌ 2015, జనవరి నుంచి 2017, డిసెంబర్‌ నెల వరకు తమిళనాడులోని ఈరోడ్‌లో ఉన్న ‘మిల్కీ మిస్ట్‌’తో 262 కోట్ల రూపాయలతో జున్ను సరఫరాకు ఒప్పందం చేసుకొంది. అనుబంధ సంస్థ బనస్కాంత డెయిరీ అతి తక్కువ ధరకు జున్నును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఓ ప్రైవేటు సంస్థతో అతి ఎక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడం పట్ల కైరా యూనియన్‌ బోర్డు సభ్యులు ఆందోళన చేశారు. అయినా ఒప్పందం మూడేళ్లపాటు నిరాటంకంగా కొనసాగింది. పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పుడు అనుబంధ సంస్థల నుంచే దిగుమతి చేసుకోవాలనే నియమకాన్ని కూడా ఇక్కడ ఉల్లంఘించారు. ఫలితంగా కైరా యూనియన్‌ పరిధిలోని పాల సేకరణ సొసైటీలకు చెందిన ఏడు లక్షల రైతులు నష్టపోయారు.

210 కోట్లు రైతులకు వచ్చేవి
అమూల్‌ ఏ ఉత్తత్తిని విక్రయించినా అందులో 80 శాతం పాల రైతులకు వెళుతుందని, ఆ లెక్కన అనుబంధ డెయిరీతోనే జున్ను సరఫరా ఒప్పందం చేసుకున్నట్లయితే రైతుల ఆదాయం 210 కోట్ల రూపాయలకు పెరిగేదని, దాన్ని పంచితే ప్రతి రైతుకు 3,114 రూపాయలు అదనపు ఆదాయం వచ్చేదని అమూల్‌ పరిధిలో మొత్తం 18 యూనియన్లను పర్యవేక్షిస్తున్న ‘గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌’ ఇదివరకే వెల్లడించింది. యూనియన్లు తీసుకునే ప్రతి నిర్ణయం, ఒప్పందం విషయంలో నాలుగు అంచెల తనిఖీ వ్యవస్థలు ఉంటాయి. యూనియన్‌ బోర్డు నెలకోసారి సమావేశం అవుతుంది. నెలకోసారి ప్రణాళికా సమావేశం జరుగుతుంది. నెలకోసారి ఫెడరేషన్, రాష్ట్ర ఆడిట్‌తో సమన్వయ సమావేశం జరుగుతుంది. యూనియన్‌కు కూడా సొంత ఆడిటర్లు ఉంటారు. ఈ నాలుగు అంచెల వ్యవస్థ ఉన్నప్పటికీ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుబంధ డెయిరీలను వదిలేసి ఓ ప్రైవేటు డెయిరీతో ఒప్పందం చేసుఉన్నారంటే అవినీతి ఎంత దూరం విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

మెహసానా డెయిరీపై కూడా
అమూల్‌ కుటుంబంలోని అతి పెద్ద మిల్క్‌ యూనియన్‌కు చెందిన బనాస్‌ డెయిరీపైనా కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2013లో అమూల్‌కు చెందిన మెహసానాలోని దూద్‌సాగర్‌ డెయిరీ అప్పటి చైర్మన్‌ విఫుల్‌ చౌధరి ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ రేటుకు 7,000 టన్నుల పాల పొడిని సరఫరా చేశారు. ఫలితంగా డెయిరీకి ఎంతో నష్టం వచ్చిందని మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ ఎస్‌ సోధియే వెల్లడించారు. పైగా అనవసరంగా డెయిరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని చౌధరి పెంచారని, దానివల్ల అనవసర ఖర్చులు పెరిగాయని ఆయన అన్నారు. 18 మిల్క్‌ యూనియన్లలో కైరా, బనస్కాంత, సబర్‌కాంత, మెహసానా యూనియన్లు పెద్దవి. దాదాపు వీటన్నింటిపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

నాడు గాంధేయవాదులు స్థాపించగా
అమూల్‌ డెయిరీని 1946లో త్రిభువన్‌ దాస్‌ పటేల్‌ లాంటి గాంధేయవాద స్వాతంత్య్ర సమర యోధులు స్థాపించారు. 1980 ప్రాంతం స్థానిక పలుకుబడి కలిగిన వ్యక్తుల చేతుల్లోకి యాజమాన్యం వెళ్లింది. 1990 తర్వాత రాజకీయ నాయకుల హవా మొదలయింది. ఒకప్పుడు నిజమైన రైతులే మిల్క్‌ యూనియన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉండేవారు. రాజకీయ పార్టీల ప్రవేశంతో అమూల్‌ యాజమాన్యంలో రైతుల ప్రభావం తగ్గి నేతల ప్రభావం పెరిగింది. రాజకీయ పార్టీల ప్రవేశంతో ఎన్నికల ఖర్చు కూడా పెరగడంతో ఎన్నికైన వాళ్లు చేసిన ఖర్చు అంతకంతకు రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడుతున్నారు.

18 మిల్క్‌ యూనియన్లు బీజేపీ చేతుల్లోనే
అమూల్‌ కుటుంబంలోని మొత్తం 18 మిల్క్‌ యూనియన్లకు చైర్మన్లుగా ప్రస్తుతం బీజేపీ నాయకులే ఉన్నారు. వారి ఆహ్వానం మేరకే ప్రధాని వచ్చి ఎంతో స్ఫూర్తి దాయకంగా మాట్లాడారు. ఆయనకు అదంతా గతమన్న విషయం తెలుసో, తెలియదోగానీ అమూల్‌ పరిస్థితి ప్రస్తుతం బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా అంటే, ఏనుగుకు బయట కనిపించే దంతాలు వేరు, లోపల నమిలే దంతాలు వేరన్నట్లు ఉంది.

మరిన్ని వార్తలు