కరోనా సాకుతో ఎన్నికలు ఆపడం తగదు

16 Mar, 2020 15:03 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఎన్నికలు వాయిదా వేయడానికి ఎన్నికల సంఘం సహేతుక కారణాలను చెప్పలేదని, కేవలం ప్రతిపక్షాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నట్లుందని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల ధోరణి వల్ల ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి వస్తుందని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఏమి మాట్లాడాలన్నా ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారనుందన్నారు. మార్చి 31లోపు ఎన్నికలు జరగకపోతే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని, ఆర్థిక వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయన్నారు. పూర్తి మెజార్టీతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు పనిచేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలి
‘రాష్ట్రంలో ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు జరగడం సర్వసాధారణం. అలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలిగానీ ఎన్నికలు ఆపడం సరికాదు. కరోనాను కారణంగా చూపి ఎన్నికలు వాయిదావేయడం సరైన నిర్ణయం కాదు. రాజ్యాంగబద్దమైన సంస్థలకు ఇది ధర్మం కాదు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం నివేదిక ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో తలెత్తబోయే ఆర్థిక ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలి’ అని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. (బాబుకు ‘లోకల్‌’ భయం)

మరిన్ని వార్తలు