ఓటా.. నోటా!

11 Apr, 2019 08:29 IST|Sakshi

సాక్షి , అనంతపురం : కరువు కోరల్లో చిక్కుకొని.. ఏళ్ల తరబడి కష్టాల ఊబిలో కూరుకుపోయిన జిల్లా అనంతపురం. ఇక్కడి పేదరికాన్ని, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని కొందరు నేతలు వేల కోట్లకు పడగలెత్తారు. కానీ ఈ నేతల రాజకీయ ఆరంభంలో ఓటేసిన ప్రజలు ఆ రోజు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉండిపోయారు. కారణం మోసం. పాతికేళ్ల కిందట కమ్యూనిస్టుల పేరు చెప్పి, ఉద్యమం పేరుతో అడవుల్లో ఉండి, రాజకీయ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేతలు, వారి కుటుంబాలు, బంధువులు తరతరాలు బతికేందుకు సరిపడా ఆస్తుల్ని సంపాదించారు. వారి నియోజకవర్గంలోని పేదప్రజలు మాత్రం మూడుపూటల మూడువేళ్లూ నోట్లోకి వెళ్లలేక అర్ధాకలితో బతుకీడిస్తున్నారు.

దీనిపై ఓటర్లు ఆలోచించాలి. రంగుల ప్రపంచంలో ఉంటూ, తండ్రి పేరుతో పదవులు దక్కించుకుని, అధికారం దక్కిన తర్వాత నమ్ముకున్న ప్రజల బాగోగులను గాలికి వదిలి అదే రంగుల ప్రపంచలో కోట్లు సంపాదిస్తూ, ఇక్కడ తన తరఫున పీఏలను పెట్టి పాలిస్తున్న పాలకులూ ఉన్నారు. ఇలాంటి నేతలకు ఓటుతో బుద్ధిచెప్పాలి. భూస్వామ్య పాలన, పెత్తందారీ వ్యవస్థను కొనసాగిస్తున్న కుటుంబాలు.. అధికారం వస్తే మనుషులను నరికేందుకు అనుమతి ఇస్తామనే అరాచకశక్తులు.. ఓ ప్రాంతానికి నియంతలుగా, రౌడీలుగా చెప్పుకుని, చికెన్‌ నుంచి ఫ్యాక్టరీల వరకు ఏది నడవాలన్నా కప్పం కట్టాల్సిందే అని వేలకోట్లకు పడగలెత్తి వారు, వారి వారసులే రాజకీయాల్లో ఉండాలనుకునే నేతలు.. సామాన్యులు వారి కాళ్లకింద చెప్పుల్లా.. చేతిలో వేటకొడవళ్లలాగానే ఉండాలని ఆలోచించే మనుషులు.. ఇలా ఎవరికి వారు స్వలాభం మినహా ప్రజల బాగోగులు పట్టని పాలకులు. వీరందరి పాలనను ఒక్కసారి ఆలోచించాలి. ఐదేళ్లు ఏంచేశారనేది గుర్తెరగాలి.

ఏం చేశారని మనసును ప్రశ్నించు:
కరువు జిల్లాలో బంగారు పంటలు పండించేందుకు ఓ మహానుభావుడు కృష్ణాజలాలను 2012లో జీడిపల్లికి తీసుకొస్తే ఐదేళ్లుగా ఆయకట్టుకు ఇవ్వకుండా కొందరు మోసం చేశారు. రైతుల బతుకులపై నీళ్లు చల్లారు. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల, ఛాగళ్లు, పెండేకల్లు, పేరూరు, బీటీపీ చెప్పుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా.. దేనికింద పది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. జిల్లాలోని ఎస్కేయూ, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలో ఏటా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని పట్టాలు చేతిలో పట్టుకుని వస్తున్నారు. వీరందరికీ ఉద్యోగాలు లేవు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ చేదోడుగా నిలుస్తామని మాట ఇచ్చిన వారు ఐదేళ్లు కన్పించకుండా పోయారు. కష్టాల్లో ఉన్నాం.. డ్వాక్రా రుణాలు మాఫీ అయితే కాస్త ఉపశమనం ఉంటుంది అని ఆశపడిన ఆడబిడ్డలను మోసం చేశారు. పదిమందికి అన్నం పెట్టె రైతులకు ‘బంగారు’ మాటలు చెప్పి, రుణాలు మాఫీ చేస్తామని, చేయకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టి ఉరికొయ్యల వరకూ తీసుకెళ్లిన ఘటన రైతుల మనసుల్లో మెదలుతూనే ఉంది. 274 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

వారి పిల్లలు, కుటుంబాలు వీధినపడ్డాయి. ఇలా మోసపు మాటలతో దగా పడ్డారు. జిల్లా అభివృద్ధికి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఎన్నికల ముందు, తర్వాత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చేయని వైనంపై రగిలిపోతున్నారు. భూములు కబ్జా చేసిన అక్రమార్కులు.. రక్తపాతాన్ని పెంచి పోషించే రౌడీలు.. అవినీతి సొమ్ముతో జల్సా చేసే అసమర్థులు.. స్వార్థచింతన మినహా ప్రజా శ్రేయస్సు పట్టని నేతలు అందరినీ ‘అనంత’ ప్రజానీకం చూసింది. అలాగే ప్రజాసేవ కోసం ఉద్యోగాలు త్యాగం చేసిన వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులనూ చూస్తోంది. రెండు వర్గాల్లో దేనికి ఓటేస్తారో.. మంచేదో, చెడేదో ఓటర్లు నిర్ణయించుకోవాలి. మాయా ప్రపంచమా? మాట ఇస్తే తప్పకుండా ప్రజల కోసం వెన్నుచూపని ధీరత్వ నాయకత్వమా? ఓటర్లే తేల్చుకోవాలి. ఇంటి నుంచి కదిలి.. పోలింగ్‌ బూత్‌కు వెళ్లి.. తీర్పు ఇవ్వాలి. మీరిచ్చే తీర్పు మీ బిడ్డ భవిష్యత్తు కోసం.. నీ ఇంటి ఆర్థిక స్వావలంబన కోసం.. మీ పల్లె, మీ మండలం, మీ జిల్లా.. ఏకంగా రాష్ట్ర భవిష్యత్‌ కోసం.. వెలుగుల సూరీడికి అండగా నిలువు. నీ భవిష్యత్తులో కాంతిరేఖను కాంక్షించు.  

మరిన్ని వార్తలు