రాజధాని పేరుతో..  అంతర్జాతీయ స్థాయి కుంభకోణం

21 Jan, 2020 04:49 IST|Sakshi

అక్కడా ఇక్కడా అంటూ అసత్య లీకులు.. తన వర్గీయులకు మాత్రం ముందే పక్కా సమాచారం

బాబు సొంత సంస్థ హెరిటేజ్‌ పేరిట కారు చౌకగా కొనుగోలు

టీడీపీ నేతలు 4,070 ఎకరాల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 

దీని విలువ రూ.40 వేల కోట్లకు పైగానే..

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన

ఆస్మదీయ ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా అప్పగింత

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అధిక రేటుకు కేటాయింపు

కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ అత్యధిక ధరకే..

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడి

సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆధారాలు, పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి రియల్‌ ఎస్టేట్‌ రాజధానిగా మార్చారని దుయ్యబట్టారు. గుంటూరు, నూజివీడు అంటూ మొదట్లో రాజధానిపై లీకులు ఇచ్చి.. ప్రజలు అక్కడ భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేసిన చంద్రబాబు అండ్‌ కో మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రహస్యాలను ఎవరికీ చెప్పబోనంటూ చేసిన ప్రమాణాన్ని (అధికార రహస్యాల చట్టాన్ని) చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు.

రాష్ట్ర విభజన తేదీ 2014 జూన్‌ నుంచి రాజధాని ప్రకటన తేదీ 2014 డిసెంబరు నెలాఖరు వరకూ ఆరు నెలల కాలంలో ఇలా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా చంద్రబాబు, ఆయన అనుచరులు సొంత పేర్లు, బినామీ పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారని మంత్రి వివరించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎకరా రూ.10 కోట్ల ప్రకారం లెక్కిస్తే 4,070 ఎకరాల విలువ రూ.40,700 కోట్లని, ఇది ఇప్పటి వరకూ తేలిన లెక్కని, విచారణలో ఇంకా ఎంత బయటకు వస్తుందో భవిష్యత్తులో తేలుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేరుతో కొనుగోలు చేశారని కూడా సభ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వివరాలను కూడా ఆయన సభలో వెల్లడించారు.  

అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి..
ఎక్కడో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ఇక్కడ విజయవాడకు 20–30 కిలోమీటర్ల దూరంలోని మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు వచ్చి ఎందుకు భూములు కొంటారు. ఇక్కడ రాజధాని వస్తుందని పక్కాగా తెలిసినందునే వారు రాజధాని ప్రకటనకు ముందే ఇక్కడ భూములు కొన్నారు. దీనిని బట్టే ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తేటతెల్లమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి. 

బినామీ పేర్లతో కొనుగోళ్లు..
- టీడీపీ నేతలు సొంతంగానూ, బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో అప్పటి మంత్రి నారాయణ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్‌ బినామీలు. 
- వేమూరి రవికుమార్, నారా లోకేశ్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల భూములు కొన్నారు. మురళీమోహన్, యార్లగడ్డ రవికిరణ్, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్‌ ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్‌ పేర్లతో భూములు కొనుగోలు చేశారు. బుచ్చయ్య చౌదరి గోరంట్ల ఝాన్సీలక్ష్మీ పేరు మీద కొనుగోలు చేశారు.   

సరిహద్దులు మార్చి..
చంద్రబాబు అండ్‌ కో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో సరిపెట్టుకోలేదు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్‌డీఏ సరిహద్దులు మార్చారు. కోర్‌ రాజధానిని జూలై 2015లో 395 చ.కి.మీలకు ప్లాన్‌ చేశారు. కానీ, 2016లో దానిని 217 చ.కి.మీ.కు తగ్గించారు. దీని వెనక.. తమ భూమిని ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వకుండా మొత్తం భూమిని ఉంచుకుని అధిక విలువ పొందడమే లక్ష్యం. రింగ్‌ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. 

లేని భూములు ఇచ్చి..
అనంతవరంలో వీరి బాగోతం ఇంకో రూపంలో సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్‌ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు తీసుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడి 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డు భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్‌ జమీందార్‌ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూములూ ఇలాగే చేశారు. 28వేల మంది రైతులు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇస్తే అందులో 14వేల మంది రైతులు ఇప్పటికే భూములు అమ్ముకున్నారు. ప్లాట్లు ఇస్తే.. 8వేల లావాదేవీలు జరిగాయి. దీనిని రాజధాని నిర్మాణం అంటారా.. లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంటారా? టీడీపీ వారే చెప్పాలి’’.. అని బుగ్గన ప్రశ్నించారు.
పయ్యావుల విక్రమసింహ (పయ్యావుల కేశవ్‌ కొడుకు), ధూళిపాళ్ల వీరవైష్ణవి (ధూళిపాళ్ల నరేంద్ర కూతురు)..
- కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్‌రావు కుటుంబీకురాలు) నంబూరులో, పుట్టా మహేష్‌ యాదవ్‌ (మంత్రి యనమల వియ్యంకుడి తనయుడు)
దమ్మాలపాటి శ్రీధర్‌ పిచ్చుకలపాలెం, నేలపాడులో, పల్లె రఘునాథరెడ్డి ఉద్దండరాయపాలెం, మందడంలో..         
దివంగత కోడెల శివప్రసాద్‌ శశిఇన్‌ఫ్రా పేరున 17 ఎకరాలు.. 
మాజీమంత్రి పరిటాల సునీత పీఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో కొనుగోలు చేశారు. 
- పీఆర్‌ ఇన్‌ఫ్రాలో పరిటాల సునీత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారు.

ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు
అప్పటి పాలకులు రాజధాని అమరావతిని సొంత రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చుకున్నారనడానికి అడ్డగోలుగా భూ కేటాయింపులూ నిదర్శనాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. అమరావతిలో మాదిరిగా ఓ విధానం, ప్రాతిపదిక లేకుండా దేశంలో మరెక్కడా భూకేటాయింపులు జరగలేదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరాలతో వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు సరసమైన ధరలకు భూకేటాయింపులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తారని.. కానీ, బాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. ‘కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎవరైనా ఎకరా రూ.4 కోట్లకు భూమి కేటాయించి ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే ఇస్తారా?’ అని బుగ్గన సభా సాక్షిగా నిలదీశారు. భూకేటాయింపులపై మంత్రి బుగ్గన అసెంబ్లీలో వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే..

125 సంస్థలకు 1,648 ఎకరాలు
రాజధాని ప్రాంతంలో అప్పటి బాబు సర్కారు 125 సంస్థలకు 1,648 ఎకరాలను కేటాయించింది. ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 68 ఎకరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 180 ఎకరాలు.. ప్రైవేటు సంస్థలకు 1,366 ఎకరాలు కేటాయించింది. వీటితోపాటు మరికొన్నింటికి కూడా కేటాయించింది. అయితే, ఇందుకు ఒక విధానం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఏడెకరాలు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ సంస్థలకు 87ఎకరాలు కేటాయించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. అలాగే, ప్రైవేటు సంస్థలైన విట్‌ ఏపీకి 200 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎంకు 200 ఎకరాలు, అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో–యూకే యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్‌ 100 ఎకరాలు, బీఆర్‌ఎస్‌ మెడిసిటీ.. ఇలా ప్రైవేటు సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. వరుణ్‌ హాస్పిటాలిటీకి నాలుగు ఎకరాలు, మహాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు నాలుగు ఎకరాలు రూ.కోటిన్నరతో ఇచ్చారు. 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయం
చంద్రబాబు లాగా ఈ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయదు. శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్‌లో పట్టుబడటం దేనికి సంకేతం? ప్రతిపక్ష నేత మొదట్లో రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. హడ్కో, వరల్డ్‌బ్యాంకు నుంచి రుణాలు తెస్తామని చంద్రబాబు అన్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మరోవైపు.. రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్షంలో ఉంది. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డొక్కల కరువు.. ముష్టికరువు అని పేర్లు కూడా పెట్టారు. గతంలో నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చి కన్నీరు కార్చారు. ఈ నేపథ్యంలో భారీ రాజధాని నిర్మాణం కంటే.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మన ముందున్న కర్తవ్యం. 

మరిన్ని వార్తలు