జగన్‌ వెంటే.. జన సునామీ..

27 Mar, 2019 07:53 IST|Sakshi
కృష్ణా జిల్లా తిరువూరులో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. రాష్ట్ర రాజకీయ యవనిక పైకి దూసుకొచ్చిన నవతరం ప్రతినిధి.. ఇచ్చిన మాట కోసం నిలబడ్డ ధీరోదాత్త నాయకుడిగా విశేష గుర్తింపు...  నిబద్ధతగల రాజకీయాలు చేస్తున్న యువ నాయకుడు.. ప్రతి మదినీ తడుతూ.. మానవీయత మేళవిస్తూ ప్రసంగాలు..తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో సాధికారికంగా చెబుతూ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ఎండగడుతున్నారు.

ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం
ఎన్నికల ప్రచారంలో ప్రభాత సూర్యుడిలా వెలుగుతున్న వైఎస్‌ జగన్‌.. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.  ఆయన మాటలో, మనసులో, నడకలో, నడతలో అణువణువునా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.  నమ్ముకున్న సిద్ధాంతం నుంచి వెనుకంజ వేయడం లేదు. తాను నమ్ముకున్న అశేషజనవాహిని ఎదురుగా ఉండగా.. నాకేం భయం అన్న మనోస్థైర్యంతో.. మొక్కవోని దీక్షతో అప్రతిహతంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జననేత  హావభావాల్లోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ, ప్రసంగాల్లోగానీ ఎక్కడా తొట్రుపాటు లేదు. మరో ఇరవై రోజుల్లో అధికారంలోకి వస్తున్నామన్న అచంచల ఆత్మవిశ్వాసం జగన్‌లో తొణికిసలాడుతోంది. అందుకే అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న తమ కార్యాచరణ ప్రణాళికను చక్కగా ఆవిష్కరిస్తున్నారు. నేను ప్రజలతో ఉన్నాను... ప్రజలు నాతో ఉన్నారు.. గెలుపు మాదే అనే విశ్వాసం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు.  


నేను విన్నాను..నేనున్నాను 
ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతిపట్ల వైఎస్‌ జగన్‌కు స్పష్టమైన దృక్పథం ఉంది.  మోసపూరిత హామీలతో ప్రజల్ని వంచించి అధికారంలోకి రావాలని భావించే రాజకీయ నాయకుడు కాదు జగన్‌.  తొమ్మిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ.. జనం కష్టాలు కళ్లారా చూస్తూ.. సమస్యల పరిష్కారానికి సాధికారికమైన మార్గాలను అన్వేషిస్తూ ప్రస్థానం సాగిస్తున్న నేత. పేదలు, సామాన్యుల కోసం ఎందాకైనా అనే మానవీయ కోణం ఆయన సొంతం. సుస్థిర ప్రగతి కోసం శాస్త్రీయ దృక్పథం అలవర్చుకున్న నాయకుడు. అందుకే సంక్షేమం, ప్రగతి అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ.. అందరికీ అండగా నేనున్నాను.. మీ సమస్యలు నేను విన్నానంటూ నవరత్నాల పేరుతో తన అజెండాను ప్రకటించారు. 

  • జగన్‌ విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. రైతులు, మహిళలు, చేనేత, బీసీ, దళిత, మైనార్టీ, ఉద్యోగ, యువత తదితర వర్గాల అభ్యున్నతికి స్పష్టమైన ప్రణాళికలను ఆవిష్కరిస్తున్నారు. ఆయన ఇస్తున్న హామీల్లో నేలవిడిచి సాము చేసేవి ఏమీ లేవు. అలా అనుకుంటే.. 2014 ఎన్నికల్లోనే ఆయన అబద్ధపు హామీలు ఇచ్చేవారు. కానీ అది జగన్‌ తత్వానికి విరుద్ధం. పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను గమనించి.. ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాలనే ఆయన హామీగా ఇస్తున్నారు.  
  • అమ్మ ఒడి  పథకంతో ప్రతి ఇంట్లో పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానన్నా.. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని ప్రకటించినా.. వృద్ధులు, వితంతువుల  పింఛన్‌ రూ.3వేలు చేస్తానన్నా... రూ.వెయ్యి దాటిన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తానన్నా... డ్వాక్రా రుణాలను దశలవారీగా మాఫీ చేస్తానన్నా... ఇల్లులేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తానన్నా.. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు ఏటా రూ.75వేలు ఇస్తానన్నా.. ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ప్రకటించినా.. సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నా... కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తానన్నా.. జగన్‌ తాను సాధికారికంగా విశ్లేషించి శాస్త్రీయంగా రూపొందించిన పరిష్కార మార్గాలతోనే.. తమ ప్రభుత్వ భవిష్యత్‌ కార్యాచరణను ఆవిష్కరిస్తున్నారు. అందుకే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతి కోసం జగన్‌ ప్రకటించిన ప్రణాళిక మీద సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.  

చంద్రబాబు అవినీతి, అరాచకాలపై ధ్వజం  

  • ప్రజాపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్ని చైతన్యపరచడమే లక్ష్యంగా జగన్‌ ప్రసంగాలు సాగుతున్నాయి. జగన్‌ తన ప్రసంగాల్లో చంద్రబాబును గాని, ఇతర నాయకులను గాని వ్యక్తిగతంగా విమర్శించరు. చంద్రబాబుతోసహా ఇతర రాజకీయ ప్రత్యర్థులు తనపై, తన కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ.. విషం కక్కుతున్నా సరే ఆయన తాను నమ్ముకున్న విలువలకే కట్టుబడుతున్నారు.  
  • చంద్రబాబు ప్రభుత్వం రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో పాల్పడిన అవినీతి.. టీడీపీ నాయకుల హత్యా రాజకీయాలు, అరాచకాలు.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడి ప్రజల ఆకాంక్షలను వమ్ముచేయడం.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగ విలువలను కాలరాయడం.. పవన్‌ కల్యాణ్‌తో కుమ్మక్కు రాజకీయాలు.. ఎన్నికల ముందు మరోసారి మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని వంచించాలనే కుతంత్రాలను.. విధానపరంగానే జగన్‌ ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి విమర్శకు తగిన ఆధారాలు, ఉదంతాలను చూపుతున్నారు.  
  • జగన్‌ మాటల్లో విద్వేషం, విచక్షణ కోల్పోవడం   ఉండవు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.. ప్రజల్ని కష్టాలపాలు చేస్తున్నారనే ఆవేదన కనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు