ఏపీ అసెంబ్లీ అప్‌డేట్స్‌: మంత్రి పితాని ఘోర ఓటమి

23 May, 2019 06:25 IST|Sakshi

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు శ్రీకాకుళం మొదలు అనంతపురం  వరకూ అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఫ్యాన్‌గాలికి సైకిల్‌ కకావికలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ హవా జోరుగా వీస్తోంది.

మంత్రి పితాని ఘోర ఓటమి
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ ఘోర ఓటమి చవిచూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు 13,085 ఓట్ల మెజార్టీతో పితానిపై విజయం సాధించారు. దీంతో ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీరంగనాధ రాజు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

విజయవాడ సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీ గెలుపు

ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుండగా.. విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఓటమి పాలయ్యారు.

జగన్‌కు ప్రణబ్‌ శుభాకాంక్షలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అద్భుత విజయం సాధించినందుకు ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘మీ పట్ల ఆంధ్ర ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా. మహానేత వైఎస్సార్ కచ్చితంగా గర్వించే రోజు ఇది’  అని ప్రణబ్‌ ఆకాంక్షించారు.

మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ ద్వారా అభినందించారు. తెలుగు ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.

25న వైఎస్సార్ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం
ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం జరగనుంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు వైఎస్సార్ సీపీ ఓ ప్రకనటలో పేర్కొంది.

ఓడిపోయిన కోడెల 
సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఓడిపోయారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఆయన 21,200 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 

నారా లోకేశ్‌ ఘోర పరాజయం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరిలో ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన 5200 ఓట్ల తేడాలో ఓడిపోయారు

అఖిలప్రియకు షాక్‌
మంత్రి అఖిలప్రియకు కర్నూలు ఓటర్లు ఊహించని షాక్‌ ఇచ్చారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిజేంద్ర రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 34,899 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.
అనీల్‌ కుమార్‌ యాదవ్‌ గెలుపు
మంత్రి నారాయణపై నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనీల్‌ కుమార్‌ యాదవ్‌ గెలుపొందారు. నారాయణపై ఆయన 800 ఓట్ల తేడాలో విజయం సాధించారు. 

వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్‌ జగన్‌కు మోదీ ఫోన్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ...ముందుగా ట్విటర్‌ వేదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ తెలుగులో ట్వీట్‌ చేశారు.

ఈ విజయం నా బాధ్యత పెంచింది: వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు నాపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈనెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు.హామీలన్నీ అమలు చేస్తాం: జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

భీమవరం, గాజువాకలో పవన్‌ ఓటమి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ బరిలో దిగిన రెండుచోట్ల ఆయన పరాజయం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ చేతిలో 3,938 ఓట్ల తేడాతో పవన్‌ పరాజయం పొందారు. మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో కూడా ఆయన ఓటమి చెందారు.

వైఎస్‌ జగన్‌కు మోదీ అభినందనలు
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళుతోంది.

అయిదోసారి సోమిరెడ్డి ఓటమి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి మళ్లీ ఓటర్లు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. ఆయన వరుసగా అయిదోసారి ఓటమి చవిచూశారు. సోమిరెడ్డిపై కాకాణి గోవర్థన్‌ రెడ్డి గెలుపొందారు.

చంద్రగిరిలో చెవిరెడ్డి విజయం
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి గెలుపొందారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసాదరాజు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్‌ బాబు, రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం సాధించారు.

భారీగా తగ్గిన చంద్రబాబు మెజార్టీ
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుపొందారు. అయితే గతంలో కంటే ఈసారి ఆయన మెజార్టీ భారీగా తగ్గింది. 2014 ఎన్నికల్లో 47,121వేల మెజార్టీ రాగా, ఈసారి దాదాపు 28వేల పైచిలుకు మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి గట్టి పోటీ ఇచ్చారు. కాగా చంద్రబాబు గతంలో కంటే 17వేల మెజార్టీ కోల్పోయారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌​ సీపీ భారీ మెజార్టీతో దూసుకువెళుతున్న విషయం తెలిసిందే.

వైఎస్‌ జగన్‌ ఘన విజయం
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో 70,400 ఓట్లుతో గెలుపొందారు. అలాగే చిత్తూరు జిల్లా నగరిలో ఆర్కే రోజా మరోసారి గెలుపొందారు. 2వేల 681 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. 

► శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన బీసీ వర్గాలకు బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య ధన్యావాదాలు తెలిపారు.

టీడీపీ అభ్యర్థి కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు
విశాఖ జిల్లా అరకులో టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన మాజీమంత్రి కిడారి శ్రవణ్‌ కుమార్‌ కంటే నోటాకే అధికంగా ఓట్లు పోల్‌ అయ్యాయి. కాగా మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ సెంటిమెంట్‌ ఏమాత్రం ఫలించలేదు. ఫ్యాన్‌ ప్రభంజనానికి సైకిల్‌ పంక్చర్‌ అయింది.

ఫ్యాన్‌ సునామి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల హవా
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎలీజా తొలి విజయం నమోదు చేయగా.. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, కృష్ణా జిల్లా పెడనలో జోగి రమేశ్‌, మచిలీపట్నంలో పేర్ని నాని, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నవాబ్‌ బాషా,మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పామర్రులో అనిల్‌ కుమార్‌, గజపతి నగరంలో బొత్స అప్పల నర్సయ్య, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, బొబ్బిలిలో శంబంగి అప్పలనాయుడు విజయం సాధించారు.  

30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా బంపర్‌ మెజార్టీతో దూసుకువెళుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  

తిరుగులేని ఆధిక్యంలో ఆర్కే
మంగళగిరిలో వైఎస్సార్‌​ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధిక్యంలో దూసుకు వెళుతున్నారు. ఆరో రౌండ్‌ ముగిసేసరికి నారా లోకేశ్‌ పై ఆయన పదివేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతీ రౌండ్‌కు వైఎస్సార్‌ సీపీ ఆధిక్యం పెరుగుతోంది.

చింతలపూడిలో వైఎస్సార​ సీపీ అభ్యర్థి ఎలీజా విజయం
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో తొలి ఫలితం వెలువడింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎలీజా ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కర్రా రామారావుపై 31వేలకు పైగా మెజార్టీ సాధించారు ఎలీజా. చింతలపూడి ఎన్నికల చరిత్రలోనే భారీ ఆధిక్యం ఇది.

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆకాంక్షించారు.

ఇది ఊహించిన విజయం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌​ కాంగ్రెస​ పార్టీ విజయాన్ని తాము ఊహించిందేనని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదానే తమ అజెండాగా పేర్కొన్నారు.  ప్రజలు, దేవుడు వైఎస్సార్‌సీపీనీ ఆశీర్వదించారన‍్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఇప్పుడే తానేమీ మాట్లాడనని వైఎస్‌ జగన్‌ అన్నారు.

యరపతినేనికి చుక్కెదురు
గుంటూరు జిల్లా టీడీపీ అభ్యర్థి యపరతినేని శ్రీనివాసరావుకు చుక్కెదురు అయింది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న గురజాల మండలంలోనే వైఎస్సార్‌సీపీ మెజార్టీలో ఉంది.  వైఎస్సార​ సీపీ 2,761 మెజార్టీతో ఉంది. పిడుగురాళ్ల, దాచేపల్లిలోనూ ఫ్యాన్‌ క్లీన్‌ స్వీప్‌ చేయనుంది. ఓటమి తప్పదని ఊహించిన యరపతినేని కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

వైఎస్సార్‌సీపీకి అఖండ​ మెజారిటీ
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 24 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 23 చోట్ల, టీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

లోకేశ్‌ వెనుకంజ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ వెనుకంజలో ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ చిత్తు
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఊహించనివిధంగా చతికిలపడింది. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించనుంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మూడో రౌండ్ ముగిసేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందజలో ఉన్నారు. తంబల్లపల్లి వైఎస్సాసీపీ అభ్యర్థి ద్వారాకనాధ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్యవేడు, నగరిలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

‘పశ్చిమ’లో ఫ్యాన్‌ హవా
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 625 ఓట్లు మెజార్టీ సాధించారు. తణుకులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు 500 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. పోలవరంలో మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలరాజు 3241 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సర్వర్లు పని చేయకపోవడంతో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. 

చంద్రబాబు వెనుకంజ
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. మొదటి, రెండో రౌండ్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి ముందజలో కొనసాగుతున్నారు. నగరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే రోజా ముందంజలో ఉన్నారు.

విజయనగరంలో వైఎస్సార్‌సీపీ హవా
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ 3500 ఓట్లతో ముందు కొనసాగుతున్నారు. ఎస్ కోట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు తొలి రౌండ్‌లో 1317 ఓట్లు ఆధిక్యం సాధించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి రెండో రౌండ్‌లో 75 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లిమర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిబడుకొండ అప్పలనాయుడు 750 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్నారు.

పరిటాల శ్రీరామ్‌ వెనుకంజ
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం: ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

టీడీపీ అభ్యంతరాలు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 60 ఏ ప్రకారం రావాల్సిన పోస్టల్ బ్యాలెట్లను 80సీ ప్రకారం పంపారని, వాటిని పరిగణలోకి తీసుకోవద్దని ఆర్వోతో వాగ్వివాదానికి దిగారు. కాగా, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు అధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం వివరణ తీసుకుంటామని ఆర్వో తెలపడంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం 8.45 గంటలకు కూడా కర్నూల్ అసెంబ్లీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు.


ఆధిక్యంలో వైఎస్‌ జగన్‌

పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో గూడురులో వైఎస్సార్‌సీపీలో దూసుకుపోతోంది. గుంటూరు జిల్లా బాపట్లలో ఫ్యాన్‌ హవా నడుస్తోంది. శ్రీకాకుళం టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు. పార్వతిపురం, చీపురుపల్లి, రాజానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

కాకినాడలో కలకలం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్‌లు ఇరవై నిముషాలు ఆలస్యంగా తెరచుకున్నాయి. తాళాల విషయంలో గందరగోళం, తెరచుకున్న స్ట్రాంగ్ రూమ్‌లలో విద్యుత్ లేకపోవడంతో కౌంటింగ్ అధికారులపై కలేక్టర్ కార్తీకేయ మిశ్రా సీరియస్ అయ్యారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

పోస్టల్ బ్యాలెట్లలో వైఎ​స్సార్‌సీపీ హవా
తూర్పు గోదావారి జిల్లా పి.గన్నవరం, శ్రీకాకుళం జిల్లా రాజాం, కడప అసెంబ్లీ స్థానం, కమలాపురం, అరకు, పాలకొండ, అమలాపురంరం, పలాస, టెక్కలి, సత్తుపల్లి, చీపురుపల్లి, సత్తెనపల్లి స్థానాల్లో బ్యాలెట్‌ కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ ఆదిక్యంలో కొనసాగుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు.

ద్వివేది సమీక్ష
రాష్ట్ర సచివాలయం నుంచి కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సమీక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి సమాచారం తెలుసుకోవటంతో పాటు అక్కడి సమస్యలను పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రాలకు అభ్యర్థులు
భీమవరంలోని సీతా పాలిటెక్నిక్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్‌కు వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ చేరుకున్నారు. విజయవాడలోని స్ట్రాంగ్ రూమ్‌ను ఎన్నికల అధికారులు మరికొద్దిసేపట్లో తెరవనున్నారు. కృష్ణాజిల్లాకు సంబంధించి 17513 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపును ఉదయం 8 గంటలకు మొదలు పెట్టనున్నారు. విజయనగరం జిల్లాలో నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 12 వందల మంది కౌంటింగ్‌ సిబ్బంది ఈ కేంద్రాల్లో సేవలందించనున్నారు. ఏజెంట్లు, అధికారులు కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అసెంబ్లీకి 74 మంది, పార్లమెంట్‌ స్థానాలకు 14 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 

మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు
ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్‌సభ స్థానాలకు మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 13 జిల్లాల్లో 36 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌కు  ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌, సర్వీస్‌ ఓట్ల లెక్కింపు అనంతరం 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 5 వేల 40 పోస్టల్‌ బ్యాలెట్లను, 60 వేల 250 సర్వీస్‌ ఓట్లను ఈసీ జారీ చేసింది. ఫలితాలు వెల్లడి కావడానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్‌ ప్రక్రియలో 25 వేల మంది కేంద్ర ఎన్నికల సిబ్బంది, 200 మంది కేంద్ర పరిశీలకులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌