గృహ నిర్మాణానికి రూ.1,869 కోట్ల సాయం

21 Nov, 2019 04:29 IST|Sakshi

ఏపీ ఇన్ పార్లమెంటు

సాక్షి, న్యూఢిల్లీ: పీఎంఏవై (అర్బన్‌) కింద ఏపీలో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర సాయం కింద రూ.1,869.36 కోట్ల మేర అందజేయాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి బుధవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. కాగా, విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఏపీలో పోలీసు దళాల ఆధునికీకరణ కోసం 2017–18, 2018–19 సంవత్సరాలకు గానూ మొత్తం రూ.82 కోట్ల మేర విడుదల చేసినట్లు తెలిపారు. పోలీసు దళాల ఆధునికీకరణకు 2019–20కి గానూ రూ.24.46 కోట్ల మేర కేటాయించామని వివరించారు.

అలాంటి ప్రతిపాదన లేదు..
జాతీయ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఏవైనా సంస్థలు స్థాపించే ప్రతిపాదనలు ఉన్నాయా అంటూ లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పి.వి.మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాదరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమిస్తూ ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేదీ లేదని తెలిపారు.

నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ 
ఏర్పాటుకు నిర్ణయం..
కేంద్ర ప్రణాళిక శాఖ జాతీయ సమగ్ర సమాచార వేదిక (ఎన్‌ఐఐపీ)ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ శాఖ మంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం సాయపడాలని, బేటీ బచావో–బేటీ పడావోలో భాగంగా 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాల్సిందిగా మిథున్‌రెడ్డి జీరో అవర్‌లో కోరారు. స్కూళ్ల మరమ్మతులు, అదనపు తరగతుల నిర్మాణం పనులను ఉపాధి హామీ పథకంలో చేర్చాలన్నారు.

సగం మంది ఉద్యోగులతో బీఎస్‌ఎన్‌ఎల్‌ను నడుపుతారా?
బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రకటించిన వీఆర్‌ఎస్‌తో 50 శాతం ఉద్యోగులు మాత్రమే మిగిలారని, వీరితో సంస్థను ఎలా నడుపుతారని చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్ప బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమిస్తూ రెండు విడతలుగా 4,500కు పైగా టవర్లు ఏర్పాటు చేశామని వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

కర్నూలులో హైకోర్టు స్థాపించాలని లాయర్లు డిమాండ్‌ చేస్తున్న మాట నిజమే
కర్నూలులో హైకోర్టు స్థాపించాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్న మాట నిజమేనని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఎంపీ ఆదాల అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. హైకోర్టు స్థాపన, నిర్వహణ అంశాలు రాష్ట్ర పరిధిలోనివన్నారు.

వర్సిటీ ఏర్పాటు మార్పును ఆమోదించండి
గిరిజన సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన కేంద్ర గిరిజన వర్సిటీని విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామం నుంచి సాలూరుకు మార్పు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిందిగా ఎంపీ గొడ్డేటి మాధవి లోక్‌సభలో కోరారు. 

ప్రత్యేక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయండి
విధేయతకు, యుద్ధస్ఫూర్తికి ప్రతీక అయిన బోయ వాల్మీకులను దేశ సేవలో భాగస్వామ్యం చేసేందుకు వారి కోసం ప్రత్యేక ఆర్మీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గోరంట్ల మాధవ్‌ కోరారు. 

ఎంవీఏ చార్జీల తగ్గింపుపై ప్రతిపాదనలు చేశారా?
విద్యుత్‌ సరఫరాకు సంబంధించి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అధిక చార్జీలు వసూలు చేస్తోందని, ఏపీలో డిస్కంలపై ఆర్థిక భారం పడకుండా చార్జీల తగ్గింపునకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఏమైనా ప్రతిపాదనలు చేసిందా? అని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఏపీకి కొత్తగా 7 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయండి
ఏపీలో కొత్తగా ఏడు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జీరో అవర్‌లో కోరారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా