టీఆర్‌ఎస్‌కే సీమాంధ్రుల మద్దతు

29 Nov, 2018 08:57 IST|Sakshi
మాట్లాడుతున్న దామోదర్‌

శ్రీకృష్ణదేవరాయ యూత్‌ అసోసియేషన్‌  

30న తెలంగాణలోని సీమాంధ్రుల ఆత్మీయ సమ్మేళనం  

సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రకు చెందిన బలిజ, కాపు, వంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపుల మద్దతు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కే ఉంటుందని శ్రీకృష్ణదేవరాయ యూత్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మిర్యాల రాఘవరావు పేర్కొన్నారు.  శ్రీకృష్ణ  యూత్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 30న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లోని మెజిస్టిక్‌ పంక్షన్‌ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారన్నారు.

కేసీఆర్‌ పాలనలో ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణను వదలి వెళ్లి ఇప్పుడు ఎన్నికలకు వచ్చి తొలుత కూకట్‌పల్లి టీడీపీ సీటు కాపులకే అని చివరిలో మాటమార్చి, తన బంధువు సుహాసినికి ఇచ్చి కాపులకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. సమైఖ్యంగా జీవనం సాగిస్తున్న సీమాంధ్రుల మధ్య కుల, మతాల చిచ్చుపెట్టాలని చూస్తున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మోసాలను, కుట్రలను సీమాంధ్రులు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణలో ఉన్న సీమాంధ్ర కాపులు 30న  కేటీఆర్‌తో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అరవ రామకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు, చాగంటి రమేశ్, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు