దార్శనికుడి దూరదృష్టి

5 Apr, 2019 08:55 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారంతా హైదరాబాద్, పరిసర మూడు జిల్లాల అభివృద్ధిపైనే దృష్టిసారించగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి అది ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పురోగతికి కృషి చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ చరిత్రలో నిలిచారనడంలో అతిశయోక్తి లేదు.

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడుల్లో సగటున 54 శాతం వృద్ధి నమోదు కావడమే కాకుండా వీటిని ఆకర్షించడంలో 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు కానీ ఆయన తర్వాత కానీ ఏ ముఖ్యమంత్రీ అందుకోలేకపోయారు. 

పారిశ్రామిక పరుగులు.. 

గంగవరం పోర్ట్‌ 
కేవలం ఏ ఒక్క రంగానికో ప్రాధాన్యం కాకుండా ఐటీ, ఇన్‌ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నా లజీ, ఎలక్ట్రానిక్స్‌తోపాటు అత్యంత ముఖ్యమైన వ్యవసాయానికి వైఎస్సార్‌ పెద్దపీట వేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే, బయోటెక్నాలజీ పార్క్, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థికమండళ్లు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, కైజెన్‌ టెక్నాలజీస్‌ లాంటివి అనేకం ఆయన హయాంలోనే శంకుస్థాపన చేయడమే కాకుండా వైఎస్‌ చేతుల మీదుగా ప్రారంభం కూడా అయ్యాయంటే పారిశ్రామిక ప్రగతిని ఎలా పరుగులు పెట్టించారో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కాకుండా ఓడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్, బ్రహ్మణి స్టీల్స్, లేపాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ లాంటి పలు కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా ఆయన అకాల మరణంతో వీటిలో చాలా వరకు  ఆగిపోయాయి. కొన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా మరికొన్ని పూర్తిగా అటకెక్కాయి. నాడు వైఎస్సార్‌ శంకుస్థాపన చేసిన బందరు పోర్టు పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోగా రాయలసీమను రతనాల సీమగా మార్చే  ఎన్‌టీపీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టు మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. 

సిసలైన మహిళా సాధికారత
 

సెజ్‌లు రాకముందు కూలి పనులకు వెళ్లే మహిళలు ఇప్పుడు పురుషులు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా నెలకు రూ. 8,000 నుంచి రూ. 12,000 వరకు సంపాదిస్తున్నారు. శ్రీసిటీ సెజ్‌లోనే సుమారు 20,000 మంది మహిళలు పని చేస్తున్నారు. తైవాన్‌కు చెందిన అపాచీ బూట్ల తయారీ కంపెనీలో సుమారుగా 18,000 మంది పని చేస్తుండగా వీరిలో 52 శాతం మంది మహిళలే ఉన్నారు.

వైజాగ్‌లో ఏర్పాటైన శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ కంపెనీ 20,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే అందులో 90 శాతం మంది మహిళలే  ఉన్నారు. సెజ్‌ల రాకతో వెనుకబడిన ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సెజ్‌ల వల్ల ఇతర ప్రాంతాల నుంచే ఉపాధి కోసం తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలకు వలస వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతాల రూపు రేఖలే మారిపోయాయి. అన్ని వర్గాలను సంతృప్తస్థాయికి తీసుకెళ్లాలన్న దివంగత వైఎస్సార్‌ దార్శనికతకు ఈ సెజ్‌లే ప్రత్యక్ష నిదర్శనాలు. 

ఐటీ జోరు.. 
వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయితే ఐటీ అభివృద్ధి ఆగిపోతుందంటూ దుష్ప్రచారం చేశారు. అయితే వైఎస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం పరుగులు పెట్టింది. ఏటా ఐటీ ఎగుమతులు రెట్టింపు కావడమే కాకుండా అప్పటిదాకా హైదరాబాద్‌కే పరిమితమైన సాంకేతిక రంగాన్ని చిన్న పట్టణాలకు కూడా విస్తరించారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఐటీ జోరు మొదలైంది.

విజయవాడలోని మేధా టవర్స్, వైజాగ్‌లోని ఐటీ టవర్స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చినవే. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద దిక్కుగా మారడం గమనార్హం. వైఎస్‌ సీఎంగా ఉండగా ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే. వైఎస్సార్‌ హయాంలో ఏటా దాదాపు రెట్టింపు వృద్ధి నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి.

బాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే రాజశేఖరరెడ్డి ఐదేళ్ల కాలంలో ఏకంగా 1,400కిపైగా కంపెనీలు తరలివచ్చాయి.  బాబు పాలనలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే ఈ సంఖ్య వైఎస్సార్‌ శకం ముగిసేనాటికి 2,85,000 దాటింది. వైఎస్‌ మరణించడానికి రెండేళ్ల ముందు నుంచి ఐటీ ఉద్యోగాల కల్పనలో ఏకంగా 50 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. ఈ స్థాయి అభివృద్ధిని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందిపుచ్చుకోలేదు.  

సెజ్‌లతో పారిశ్రామిక విప్లవం 
వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక 13 జిల్లాల్లో 28 సెజ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖల్లో ఫార్మా, ఐటీ సెజ్‌లను ప్రోత్సహిస్తే  కాకినాడలో ఇన్ఫోటెక్, జీఎంఆర్‌ సెజ్‌లు, విజయవాడలో ఎల్‌అండ్‌టీ హైటెక్‌ సిటీ (మేథా టవర్స్‌), నెల్లూరులో కృష్ణపట్నం సెజ్, మాంబట్టు, మేనకూరు, చిత్తూరు జిల్లాలో శ్రీసిటీని ఏర్పాటు చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సెజ్‌ల ద్వారా సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన  ఒక్క శ్రీసిటీలోనే ఇప్పుడు 90కిపైగా చిన్న, పెద్ద కంపెనీలు ఏర్పాటై 35,000 మందికి ఉపాధి లభిస్తోంది. 2007లో వైఎస్‌ ప్రారంభించిన మాంబట్టు సెజ్‌లో 14,000 మంది పని చేస్తున్నారు. 2008లో ప్రారంభమైన మేనకూరు సెజ్‌లో పది  కంపెనీలు ఏర్పాటు కాగా 7,000 మందికి ఉపాధి లభించింది.

వైఎస్‌ హయాంలోనే ఏర్పాటైన డాక్టర్‌ రెడ్డీస్, దివీస్, రాంకీ, హెటెరో, అరబిందో లాంటి ఫార్మా సెజ్‌లతోపాటు విశాఖ, కాకినాడ, విజయవాడల్లో నెలకొల్పిన ఐటీ సెజ్‌ల్లో  వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవి కాకుండా హైదరాబాద్‌లో ఏర్పాటైన ఐటీ సెజ్‌ల ద్వారా కనీసం మరో రెండు లక్షల మందికి ఉపాధి లభించింది. 

భారీగా పెరిగిన ఎగుమతులు
ఐటీ నుంచి బీటీ దాకా.. వ్యవసాయం నుంచి తయారీ వరకు అన్ని రంగాల్లో ఎగుమతులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భారీగా పెరిగాయి. గతంలో రూ.5,025 కోట్లుగా ఉన్న ఎగుమతులు వైఎస్‌  ముఖ్యమంత్రి అయిన తరువాత ఏకంగా 375 శాతం పెరిగి రూ.73,143 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఖనిజ రంగాల్లో ఎగుమతులు భారీగా వృద్ధి చెందాయి.  

2003–04లో రూ.1,805 కోట్లుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2009–10 నాటికి రూ.5,833 కోట్లకు పెరిగాయి. ఖనిజాల ఎగుమతులు రూ.862 కోట్ల నుంచి రూ.3,499 కోట్లకు, ఫార్మా రూ.3,753 కోట్ల నుంచి రూ.13,650 కోట్లకు, ఇంజనీరింగ్‌ రూ.1,368 కోట్ల నుంచి రూ.9,141 కోట్లకు, ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు రూ. 84 కోట్ల నుంచి రూ.3,151 కోట్లకు పెరిగాయి. వైఎస్సార్‌ అన్ని రంగాలను ప్రోత్సహించారనేందుకు పెరిగిన ఎగుమతులే నిదర్శనం.  
 

2003-04 2009-10
వ్యవసాయం
 
 1,805 5,833 
లెదర్‌  1,785 1,889 
ఖనిజాలు  862 3,499
చేనేత    447 1,613
హస్తకళలు  252 885
ఇంజనీరింగ్‌ 1,368 9,141
ఎలక్ట్రానిక్స్‌ 84 3,151
ఐటీ 5,025 33,482
ఫార్మా 3,753 13,650
మొత్తం 15,381 73,143

మరిన్ని వార్తలు