బీజేపీలో చేరికకు టీడీపీ నేతల ఆసక్తి

17 Jun, 2019 14:35 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మురళీధర్‌రావు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వెల్లడించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి కోలుకునేది కాదని, ఇకపై గెలుపు దిశగా పయనించే అవకాశాలు ఆ పార్టీకి లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ మార్పునకు నాంది పలకబోతున్నాయని చెప్పారు. మరోవైపు వరుసగా రెండోసారి మోదీ గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల చూపు బీజేపీపై పడిందన్నారు.

బీజేపీ వల్లే తమ రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని తమతో వ్యక్తిగతంగా జరుగుతున్న చర్చల్లో పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అలాంటి వారందరూ రానున్న రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని ఒక స్పష్టత వచ్చిందని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి ముందుముందు వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి పట్ల బీజేపీ ఎలాంటి భేదాభిప్రాయాలు చూపదని.. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఇవ్వకపోయినా, ఆ ప్రయోజనాలను ఇతరత్రా ఏ రూపంలో ఇవ్వవచ్చో ఆ మేరకు ఇస్తామన్నారు. కాగా అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.

జూలై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు
దేశ వ్యాప్తంగా చేపట్టబోతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రత్యేక దృష్టితో మొదలు పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జూలై 6న శ్రీకారం చుట్టనున్నారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదులో పశ్చిమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
డిసెంబరు నాటికి కొత్త అధ్యక్ష ఎన్నిక పూర్తి
పార్టీ సభ్యత్వ నమోదు సమయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బూత్‌ స్థాయి నుంచి అధ్యక్ష ఎన్నికలను మొదలు పెట్టి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు డిసెంబరు నెలాఖరకే పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

>
మరిన్ని వార్తలు