నేనంటే నేను

14 Apr, 2019 07:26 IST|Sakshi

గుబులు రేపుతున్న భారీ పోలింగ్‌

సార్వత్రిక సమరం ముగిసింది. ప్రజాతీర్పు స్ట్రాంగ్‌రూంలలోని ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ‘జడ్జిమెంట్‌ డే’కు మరో 40 రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్‌ ముగియడం, భారీగా పోలింగ్‌శాతం నమోదు కావడంతో సర్వత్రా పోలింగ్‌ జరిగిన తీరుపైనే చర్చ సాగుతోంది. ఎప్పుడూలేని విధంగా రాత్రి వరకూ ఓటర్లు క్యూలో నిల్చొని ఓటేశారు. ఇప్పుడు ఈ అంశం కేంద్రంగానే పోలింగ్‌ సరళిని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే పోలింగ్‌ శాతం పెరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుంటే, టీడీపీ వాదన అందుకు భిన్నంగా ఉంది. మొత్తం మీద ఎవరికి వారు పోలింగ్‌ తీరును విశ్లేషించుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. రాజకీయ పార్టీల నేతలు ‘రిలాక్స్‌ మూడ్‌’లో ఉన్నప్పటికీ గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? ఏ డివిజన్, పంచాయతీల్లో తమకు ఎక్కువగా వచ్చాయి? ఎక్కడ తక్కువ వచ్చి ఉంటాయి? ఏ లీడర్‌ మనకు సహకరించారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు అని రకరకాల అంశాలను చర్చిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సరళి, పెరిగిన పోలింగ్‌ శాతంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో 79.65శాతం నమోదైతే, ఇప్పటి ఎన్నికల్లో 82.22 శాతం నమోదైంది. అంటే 2.57 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఊహించని విధంగా ఓటెత్తిన ‘అనంత’ ఓటర్లు:
జిల్లా వ్యాప్తంగా 3,884 పోలింగ్‌ బూత్‌లలో ఈ నెల 11న పోలింగ్‌ నిర్వహించారు. ఇందుకోసం 9,330 ఈవీఎంలు వినియోగించారు. ఉదయం 7గంటలకే పోలింగ్‌ మొదలైంది. అయితే 97 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యమైంది. వీటిలో 10 నుంచి 30 నిమిషాల్లోపు 50 ఈవీఎంల సమస్య పరిష్కారమై పోలింగ్‌ మొదలైంది. ఆపై మరో 30–60 నిమిషాల్లోపు తక్కిన ఈవీఎంలు కూడా పనిచేశాయి. అంటే జిల్లాలో అన్ని పోలింగ్‌ సెంటర్లలోని ఈవీఎంలు సక్రమంగా పనిచేశాయి. వీటికి ఉపయోగించిన 9,993 వీవీ ప్యాట్స్‌ కూడా పనిచేశాయి. పైగా ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫొటో కూడా ఈవీఎంపై స్పష్టంగా ఉంది.

ఈవీఎం బటన్‌ నొక్కగానే పెద్దగా లైటింగ్, బీప్‌ శబ్దం రావడంతో పాటు ఏ గుర్తుపై ఓటేశారో ప్రింట్‌ కూడా వచ్చింది. వీటిని ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఇలా వీవీప్యాట్‌ ద్వారా ప్రింట్‌ వచ్చే ప్రక్రియతో ఒక్కో ఓటర్‌ ఓటు వేసేందుకు పట్టే సమయం కాస్త ఎక్కువైంది. పైగా వేసవి కావడం, ఎండలు మండిపోవడంతో మధ్యాహ్నం ఓటర్ల సంఖ్య తగ్గింది. సాయంత్రం భారీగా వచ్చారు. ఈ మొత్తం పరిణామాలతో పోలింగ్‌ సమయం ముగిసే గడువు 6గంటలకు అధికశాతం పోలింగ్‌స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. అయితే క్యూలో నిల్చున్న వారందరూ ఓటేసేలా ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాత్రి 10.30గంటల వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

మొదట్లో నెమ్మదించి.. తర్వాత జోరందుకున్న పోలింగ్‌
ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రక్రియ మొదలైనా.. 9గంటల వరకూ పోలింగ్‌ మందగించింది. అందుకే 9గంటల వరకూ 10.62శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11గంటలకు 21.47శాతం నమోదైంది. 11 నుంచి పోలింగ్‌శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.86శాతం నమోదైతే, 3 గంటలకు 54.96 శాతానికి చేరింది. 5గంటలకు 67.08శాతం నమోదైంది. 5 నుంచి పోలింగ్‌ ముగిసే సమయానికి ఏకంగా 15.14శాతం నమోదై 82.22శాతంతో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది.

పోలింగ్‌ శాతం పెరగడంపై ఎవరికి వారు ధీమా
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. దీంతో పోలింగ్‌శాతం పెరిగిన తీరును ఇరుపార్టీలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది ఓట్ల రూపంలో చూపించారని వైఎస్సార్‌సీపీ అంటోంది. అందుకే ఇంత భారీగా పోలింగ్‌ పెరిగిందని, ‘మార్పు’ కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని చెబుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, పసుపు కుంకుమ, పింఛన్‌ డబ్బుల ప్రభావం ఉందని అందుకే ప్రజలు తరలివచ్చి టీడీపీకి ఓటేశారనేది వారి వాదన. అయితే టీడీపీ చేసిన గిమ్మక్కులను ప్రజలు నమ్మరని, పసుపు–కుంమ, పింఛన్లు ఎన్నికల ముందు తాయిళాలు వేసినట్లుగా ప్రజలు భావించారని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఈ రెండుపార్టీలు కాకుండా రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు తీర్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా రెండుపార్టీల్లో ఎవరి వాదన నిజం అనేది తేలాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. 

ఈవీఎంలపై అనుమానం తగదు 
ఈవీఎంలలో ఎలాంటి పొరబాట్లు ఉండవు. ఎన్నికల కమిషన్‌ ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని చంద్రబాబు మరిచి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్‌ పాత్ర చాలా గొప్పది. సంస్థ దృష్టిలో అందరూ సమానమే. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ ప్రక్రియలో ఈవీఎంలనే వినియోగిస్తున్నారు.   – భాస్కరరెడ్డి, న్యాయవాది, పెనుకొండ 

2014 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా?

ఈవీఎంలపై నిందలు వేస్తూ ఓ సీఎం స్థాయిలో చంద్రబాబు మా ట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలు వాడారు. మరీ ఆ ఎన్నికల్లో ఇదే తరహాలోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారా? అప్పట్లో వీవీ పాట్‌లు లేవు. ఓటు ఎవరికి వేసింది తెలియక తికమకపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి ఓటు వేసిందీ చాలా స్పష్టంగా అందరూ వీవీపాట్‌లలో చూసి తెలుసుకున్నారు. ఓటమి భయంతో తప్పును ఈవీఎంలపై నెట్టేయడం సబబు కాదు.  – నాగిరెడ్డి, విశ్రాంత ఎంఈఓ, పుట్టపర్తి  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా