‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’

26 Jul, 2019 13:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. దీనికి సమాధానంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తవ్విన కాల్వలపై లిఫ్టు పెట్టి పట్టిసీమ పేరుతో గత ప్రభుత్వం తెగ హడావిడి చేసిందన్నారు. పట్టిసీమలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ తెలిపిందని గుర్తుచేశారు. మహానేత వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజక్టు మొదటి సొరంగ పనులను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా మంత్రి అనిల్‌ మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మహానేత వైఎస్సార్‌ మొదలుపెట్టారని గుర్తుచేశారు. 2012లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారని తెలిపారు. ఎన్నికలకు నాలుగు నెలలు ఉందనగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఈ ప్రాజెక్టును మరోసారి మొదలుపెట్టారని విమర్శించారు. నాలుగేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు దానిని ప్రారంభించడం చూస్తే వారికెంతా చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉందన్నారు.    
 

మరిన్ని వార్తలు