భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం

20 Aug, 2019 04:21 IST|Sakshi

సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కట్టడి

సీఎం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఆదేశాలిచ్చారు

టీడీపీవి దిగజారుడు రాజకీయాలు

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి: కృష్ణానదికి వచ్చిన భారీ వరదను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని,  శ్రీశైలం డ్యాం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కట్టడి చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా తగిన ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం నుంచి 6 రోజుల పాటు సగటున 8 లక్షల క్యూసెక్కులు వదిలినా అన్ని ప్రాజెక్టులను నింపుకుంటూ ప్రకాశం బ్యారేజీ నుంచి సగటున 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదలడం ద్వారా దిగువనున్న ప్రాంతాలు సాధ్యమైనంత వరకు మునగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు. 13న ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 270 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిసిందన్నారు.  వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటే టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదిలేశారని, మరోసారి నీళ్లని ఆపి ఒకేసారి వదలడం ద్వారా చంద్రబాబు ఇల్లును ముంచే కుట్ర చేశారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

15 రోజుల్లో సీమ ప్రాజెక్టులన్నీ నింపుతాం...
రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కసుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికి అనుగుణంగా కొన్ని పత్రికలు, చానల్స్‌ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదలేస్తున్నారంటూ కనీసం కాలవల సామర్థ్యం మీద అవగాహన కూడా లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని ప్రాజెక్టులకు 35 టీఎంసీలను తరలించామని, మరో 15 రోజులు పాటు వరద కొనసాగే అవకాశం ఉండటంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ నింపగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పధ్నాలుగు మండలాల్లో 53 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని,6 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 81 బోట్లు గల్లంతు అయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అదే విధంగా  కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపు ప్రభావానికి గురవ్వగా, 4,300 హెక్టార్లలో వ్యవసాయం, 4,086 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందన్నారు. 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలిందని, నష్టంపై ఇంకా సర్వే జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు