‘చంద్రబాబు కొత్త డ్రామా’

13 Mar, 2018 18:54 IST|Sakshi
విలేకరుల సమావేశంలో అనిల్‌, గోపాల్‌రెడ్డి, నాగార్జున

సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మేరుగ నాగార్జునతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సింది అసెంబ్లీలో కాదు కేంద్రంలోనని, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. గతంలో అరుణ్‌ జైట్లీ, వెంకయ్యకు సన్మానాలు చేసి ధన్యవాదాల తీర్మానాలు పెట్టిన సంగతి గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా భయపడుతుందని దుయ్యబట్టారు. దుగరాజపట్నం పోర్ట్ అవసరం లేదు అని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రంతో పోరాడైనా, నిలదీసైనా ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరులో కలుషిత నీరు తాగి 10 మంది చనిపోగా, వందల మంది ఆసుపత్రిలో చేరితే తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. దీనికి బాధ్యత వహించి మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

రామయ్యా.. ఇప్పుడేం చెబుతావ్‌: నాగార్జున
చంద్రబాబు దళిత వ్యతిరేకని, పదవులు ఇస్తాను అని వారికి అన్యాయం చేయడం బాబు నైజమని మేరుగ నాగార్జున విమర్శించారు. దళితులని బలిపశువులు చేయడం బాబుకు అలవాటేనని, వర్ల రామయ్య ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు ఇప్పటికైనా కళ్లుతెరవాలని సూచించారు.

అశోక్‌బాబు వత్తాసు: గోపాల్‌రెడ్డి
ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తకుండా ఇప్పుడు హోదా అంటున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై ఏరోజూ అశోక్‌బాబు పోరాడలేదని, పైగా ప్రభుత్వానికి వత్తాసు పలకడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు