టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే పదవుల తొలగింపు

9 Jul, 2018 07:57 IST|Sakshi

అన్నాడీఎంకే అధిష్టానం హెచ్చరిక

టీవీలో చర్చా కార్యక్రమాలపై నిఘా

టీ.నగర్‌: అన్నాడీఎంకే అధికారపూర్వక వక్తలు మినహా ఇతర కార్యకర్తలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే అధిష్టానం హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అంగీకారంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లో అధికారపూర్వక వక్తలు, ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వార్తపత్రికలు, రేడియో, టీవీలకు పంపినట్లు తెలిపారు. అందువల్ల ప్రచారమాధ్యమాలు అన్నాడీఎంకే అధికార ప్రతినిధులను మాత్రమే చర్చా కార్యక్రమాలకు ఆహ్వానించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఒకే రోజులో పదవుల తొలగింపు: పుదుక్కోట్టైలో సంచలనం
 పుదుక్కోట్టైలో ఓపీఎస్‌ మద్దతుదారులకు పార్టీలో పదవులు ఇచ్చిన మరుసటి రోజే వారి పదవుల నుంచి తొలగించారు. పుదుచ్చేరి మున్సిపల్‌ అధ్యక్షుడిగా ఉన్న కార్తిక్‌ తొండైమాన్‌ పుదుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఖాళీగా ఉన్న మున్సిపల్‌ అధ్యక్ష పదవికి అన్నాడీఎంకే ఇలంజర్, ఇలంపెన్‌గల్‌ పాసరై జిల్లా కార్యదర్శిగా ఉన్న రాజశేఖరన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడగా కార్తిక్‌ తొండైమాన్, రాజశేఖర్‌ ఓపీఎస్‌ వర్గంలో ఉన్నారు.

దీంతో వీరి వద్ద ఉన్న పదవులను లాక్కున్నారు. అన్నాడీఎంకేలో పదవులను ఇవ్వాలని కార్తిక్‌ తొండైమాన్, రాజశేఖరన్‌ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. దీంతో కార్తిక్‌ తొండైమాన్‌కు ఎంజీఆర్‌ ఇలంజర్‌ జిల్లా అధ్యక్ష పదవి, రాజశేఖరన్‌కు ఎంజీఆర్‌ ఇలంజర్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవిని గత ఐదో తేదీన అప్పగించారు. దీంతో వారి మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్‌ పదవిని మరుసటి రోజే లాక్కోవడంతో మద్దతుదారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు