మోదీకి అహం బాగా పెరిగిపోయింది

22 Jan, 2018 08:38 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మాటల తుటాలు పేల్చారు. ప్రధాని అయ్యాక మోదీకి అహం బాగా పెరిగిపోయిందంటూ హజారే విరుచుకుపడ్డారు. 

సంగలి జిల్లా అట్పది మండలంలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ ర్యాలీలో హజారే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ మూడేళ్లలో ప్రధాని మోదీకి 30కి పైగా లేఖలు రాశాను. ఒక్కదానికి కూడా బదులు ఇవ్వలేదు. ప్రధాని పదవి చేపట్టాక మోదీకి అహం బాగా పెరిగిపోయింది. అందులో నా లేఖలను బదులు ఇవ్వటం లేదు’’ అని హజారే విమర్శించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన రావటం ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక మార్చి 23 నుంచి మరోసారి ఆయన జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్‌, లోకాయుక్తా నియామకం, రైతులకు 5 వేల పెన్షన్‌, పంట ఉత్పత్తులకు అధిక రేట్ల విధింపు తదితర డిమాండ్‌లతో ఆయన ఉద్యమం చేపట్టబోతున్నారు. ఈలోగా మూడు ప్రజా ర్యాలీలను నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి ర్యాలీని నిర్వహించారు. ఇక ఢిల్లీ రాజకీయ పరిణామాల గురించి(ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం) ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు హజారే విముఖత వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు