సాక్షి కార్యాలయం వద్ద అన్నం అనుచరుల దౌర్జన్యం

25 Dec, 2018 05:06 IST|Sakshi
సాక్షి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తున్న అన్నం అనుచరులు

మంగళగిరిలో కార్యాలయం ముట్టడికి తీవ్ర యత్నం

పలు వాహనాల్లో వచ్చి హడావుడి 

పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయింపు

మంగళగిరి/బాపట్లటౌన్‌: ప్రభుత్వ భూములు తనఖా పెట్టి బ్యాంకును బురిడీ కొట్టించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ అనుచరులు సాక్షి దినపత్రికపై దౌర్జన్యానికి దిగారు. ఆదివారం ప్రచురితమైన సంచికలో తన బండారం సాక్షి బయటపెట్టిందని అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయాలను ముట్టడించాలని అనుచరులు, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో సోమవారం వారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఉన్న సాక్షి కార్యాలయాన్ని ముట్టడించి ధ్వంసం చేయాలని పథకరచన చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సాక్షి కార్యాలయం వద్దకు చేరుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారమే ఇలాంటి పథక రచన చేయగా బాపట్ల నుంచి బయలుదేరిన ఆయన అనుచరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. 

దూషణల పర్వం..
బాపట్ల నుంచి వాహనాల్లో అన్నం సతీష్‌ అనుచరులు బయలుదేరినప్పటినుంచి తమ అనుకూల మీడియాకు సమాచారం ఇస్తూ వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నినాదాలు చేసుకుంటూ సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో పాటు సాక్షి దినపత్రికపై ఇష్టానుసారం దూషణల పర్వం కొనసాగించారు. తమతో తీసుకొచ్చిన రైతులకు ఏం మాట్లాడాలో ముందే చెప్పి మీడియాతో మాట్లాడించారు. బందోబస్తును ఛేదించి కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు గట్టిగా ప్రతిఘటించడంతో కార్యాలయం గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అన్నం యువసేన సత్తా ఏమిటో వైఎస్‌ జగన్‌కు, సాక్షికి చూపిస్తామంటూ బెదిరించారు. గుంటూరు నార్త్‌ జోన్‌ డీఎస్పీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ చింతా రవిబాబు, రూరల్‌ ఎస్‌ఐ వీరనాయక్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బంది, క్యూఆర్టీ బృందంతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పత్రికలపై దాడి సరికాదు: కోన రఘుపతి
పత్రికలో వార్త వస్తే వాటి కార్యాలయాలపై దాడి చేయటం, యాజమాన్యాలను దూషించడం సరికాదని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాక్షిలో ప్రచురించిన కథనంపై అధికార పార్టీ నాయకులు పత్రిక కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. విలేకరులు వారికున్న ఆధారాలతో వార్తలు రాస్తారని, అధికారంలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వారి దగ్గరున్న ఆధారాలను చూపిస్తూ సమాధానం చెప్పుకోవాలన్నారు. రైతులకు రుణం ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకు అధికారులు.. అధికార పార్టీ నేత విషయంలో జాగ్రత్త వహించకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేతలు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు.
సాక్షి కార్యాలయం వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు 

>
మరిన్ని వార్తలు