టీడీపీకి రాజీనామా.. లోకేష్‌పై ఘాటు విమర్శలు

10 Jul, 2019 19:00 IST|Sakshi

ఎన్నికల్లో ఓటమికి లోకేషే కారణం

సిగ్గుంటే  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి

మరికొంతమంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు: అన్నం సతీష్‌

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌.. ఆ మరుక్షణనే నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి లోకేష్‌ వ్యవహారమే కారణమని మండిపడ్డారు. కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్‌ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
చదవండి: టీడీపీకి షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కేతో కలిసి చట్టసభల్లో కూర్చోడానికి లోకేష్‌కు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్‌ సవాల్‌ విసిరారు. లోకేష్‌ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్‌ సంస్థలా పార్టీ తయారైందని అన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. కాగా బుధవారమే ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి సతీష్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
చదవండి: టీడీపీకి మరోషాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా!

మరిన్ని వార్తలు