షెడ్యూల్‌ వెలువడిన రెండ్రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

28 Feb, 2019 21:27 IST|Sakshi

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులందరినీ ప్రకటిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జిలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షెడ్యూల్‌ విడుదలైన వెంటనే బస్సు యాత్ర కూడా చేపడతానని అన్నారు. సమర్థత ఉన్నవారికి ఎన్నికల ఇంచార్జిలుగా బాధ్యత అప్పగిస్తున్నానని వివరించారు. పార్టీ గెలుపులో ఇంచార్జిలు పోషించే పాత్ర కీలకమన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలవాలని ఇంచార్జిలను కోరారు.

వారిని గెలిపించడమే మీ బాధ్యత, గెలుపును మీ భుజస్కంధాలపై వేసుకోండని ఇంచార్జిలను అభ్యర్థించారు. వచ్చే 45 రోజుల కాలం అత్యంత కీలకమన్నారు. 9 ఏళ్లుగా పోరాటాలు చేశారు.. ఈ 45 రోజులు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని విన్నవించారు. కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలు బతకాలంటే పార్టీ గెలుపు ఒక్కటే మార్గమన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇంచార్జిలతో పాటు పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, విజయసాయిరెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు