అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారు ? : రాహుల్‌ గాంధీ

31 Jan, 2020 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సీటీలో ఓ టీనేజర్‌ కాల్పులు జరపడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాల్పులు జరపమని అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంటు ఆవరణలో జరిగిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

(చదవండి : జామియా విద్యార్థులపై కాల్పులు)

బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘జామియా షూటర్‌కి డబ్బులు ఎవరు చెల్లించారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు  తెలుపుతున్న ప్రజలపై దాడులు చేయడం సరికాదన్నారు. 

(చదవండి : కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే)

మరోవైపు కాల్పుల ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ట్విటర్‌లో స్పందించారు. ‘‘కాల్చిపారేయాలి అంటూ బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాంటి ఢిల్లీని నిర్మించాలనుకుంటున్నారు అని అడిగితే మోదీ సమాధానం చెప్పగలరా? వాళ్లు హింస వైపు నిలబడతారా, అహింస వైపు నిలబడతారా? అభివృద్ధి వైపు నిలబడతారా? అల్లర్ల వైపు నిలబడతారా?’ అని ఆమె ప్రశ్నలు కురిపించారు. కాగా, గురువారం జామియా మిలియా యూనివర్సీటీలో 17 ఏళ్ల ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంభక్త్‌ గోపాల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు