రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

8 Aug, 2018 14:16 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి 

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బస్వా లక్షీనర్సయ్య విమర్శించారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని రైతులు గత పదిరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో 6టీఎంసీలు డెడ్‌ స్టోరేజీ, 6 టీఎంసీలు మిషన్‌ భగీరథ, 4 టీఎంసీలు ఆవిరి నష్టాల కింద ఉంచుతున్నారని, అందులో నుంచి ఒక టీఎంసీ నీటిని వదిలితే నష్టమేంటని ప్రశ్నించారు. 

రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది..

రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగేళ్లలో రైతులకు చేసింది శూన్యమని వారు ఆరోపించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారని, కానీ కొత్తగా జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీరందించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు, మల్లన్నసాగర్‌లో రైతులను కొట్టి రక్తాన్ని కళ్లచూసిన చరిత్ర, మెదక్‌లో కరెంట్‌ కోసం, ఇప్పుడు సాగునీటిని అడిగిన రైతులపై కేసులు నమోదు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాని దని విమర్శించారు.  

ఎస్సారెస్పీ నుంచి వెంటనే 26 గ్రామాల రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ సవరణ బిల్లు–2018 పార్లమెంట్‌లో ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈసమావేశంలో నాయకులు గజం ఎల్లప్ప, జాలిగం గోపాల్, న్యాలం రాజు, లింగం, శైలజ, పుట్ట వీరేందర్, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు