మోదీ హవాతో కేసీఆర్‌లో ఆందోళన: షానవాజ్‌ 

10 May, 2018 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ హవాతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయ ఎత్తుగడలకు ప్రాధాన్యమిస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని, ఆ గెలుపు ప్రభావం తెలంగాణపై స్పష్టంగా ఉంటుందని షానవాజ్‌ అన్నారు. ఏపీలోనూ బీజేపీ మంచి విజయం అందుకుంటుందని జోస్యం చెప్పారు.

కర్ణాటకలో బీజేపీ గెలుపు దాదాపు ఖాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో 13 రాష్ట్రాల్లో ఓటమిని చవిచూసిన రాహుల్‌గాంధీ.. తల్లిపై ఒత్తిడి తెచ్చి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని, ఆ తర్వాత ఐదు ఓటములు ఆయనకు స్వాగతం పలికాయన్నారు. ఇప్పుడు ఆరో ఓటమి కూడా సిద్ధంగా ఉందని.. అందుకే తీవ్ర అసహనంతో ప్రధాని అవుతానంటూ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2024 వరకు ప్రధాని కుర్చీ ఖాళీగా ఉండదని, అలాంటప్పుడు ఆయనకు ప్రధాని యోగం ఎక్కడిదని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు