రేపు ఎవరైనా సీఎం కావచ్చు 

19 Nov, 2019 08:53 IST|Sakshi

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు

ఎడపాడిని సీఎంగా ఊహించారా..?

సాక్షి ప్రతినిధి, చెన్నై: సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి కలలు కన్నారా, అలాగే రేపు ఎవరైనా సీఎం కావచ్చు సూటిగా పేరుపెట్టి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరోకాదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలూ చోటుచేసుకుంటాయని మరో బాంబు పేల్చి కలకలం రేపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చనే ఉదాహరణకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జయలలిత హఠాన్మరణం వల్ల అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ జైలు పాలయ్యారు. పెద్దగా గుర్తింపులేని ఎడపాడి పళనిస్వామి అకస్మాత్తుగా సీఎం అయ్యారు. ఎడపాడి ప్రభుత్వం రోజుల్లోనో నెలల్లోనో కూలిపోగలదని అందరూ ఆంచనావేయగా సుస్థిరమైన ప్రభుత్వంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వెలిగిపోయిన జయలలిత, కరుణానిధి కన్నుమూసిన తరువాత కమల్‌హాసన్, రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేశారు. వీరిలో కమల్‌.. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించి గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నా, ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టి 2021లో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమల్‌ పనిచేస్తున్నారు.
 
పార్టీ స్థాపనపై మీనమేషాలు
2017 డిసెంబర్‌లో రాజకీయ అరంగేట్రం చేసినా పార్టీ స్థాపనపై రజనీకాంత్‌ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతను తాను భర్తీ చేస్తానని రజనీకాంత్‌ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. రజనీ, కమల్‌ ఇద్దరూ సీఎం కుర్చీపై కన్నేసి ఉన్నారని తేటతెల్లమైంది. రజనీ అనుకుంటున్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని, అతని వ్యాఖ్యలను అన్నాడీఎంకే తిప్పికొట్టింది. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని సీఎం ఎడపాడి వ్యాఖ్యానించారు. తమిళతెరపై ఎంజీ రామచంద్రన్‌ తరువాత నెంబరు 2 ఉండిన శివాజీగణేశన్‌ పెట్టిన పార్టీ ఘోరపరాజయం పాలైన సంగతిని ఆయన గుర్తుచేశారు. వారిద్దరికీ రాజకీయాలు ఏమితెలుసని ఎద్దేవా చేశారు.

నిన్న ఎడపాడి, రేపు.. రజనీకాంత్‌ 
సీఎం ఎడపాడి చేసిన వ్యాఖ్యలపై కొన్నిరోజులుగా మౌనం పాటించిన రజనీకాంత్‌ ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన కమల్‌ జన్మదినోత్సవ సంబరాల్లో నోరు విప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని అన్నారు. సీఎం అవ్వాలని రెండేళ్ల క్రితం ఎడపాడి కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన సీఎం అయ్యాక ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని 99 శాతం మంది ప్రజలు భావించారు. ఇలాంటి ఆశ్చర్యాలు రేపుకూడా జరగవచ్చని వ్యాఖ్యలతో రాజకీయ కలకలం రేపారు. ఎడపాడిలానే తాను కూడా సీఎం కాగలననేదే రజనీకాంత్‌ మాటల్లోని మర్మమని అంటున్నారు. ఎడపాడితో రజనీకి పోలికా అని కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌ విమర్శించారు. ఎడపాడి రాత్రికి రాత్రే సీఎం కాలేదు, పారీ్టలో గ్రామస్థాయి నుంచి పనిచేస్తూ సీఎంగా ఎదిగారని ఆయన గుర్తుచేశారు.  

మరిన్ని వార్తలు