మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

27 Jan, 2020 18:07 IST|Sakshi

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ అసెం‍బ్లీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్‌ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్‌)


చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్‌.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్‌కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్‌ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.

అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి  మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు